ఐఫోన్ ఈఎంఐ ఒక్కటే కారణం కాదు.. గతంలోనూ అదే కొండపై ఆత్మహత్యాయత్నం..
ABN , Publish Date - Aug 24 , 2026 | 09:51 AM
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల విషయంలో తండ్రితో గొడవపడి కొండపైకి వెళ్లిన కునాల్ అనే యువకుడు అక్కడి నుంచి దూకేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల విషయంలో తండ్రితో గొడవపడి కొండపైకి వెళ్లిన కునాల్ అనే యువకుడు అక్కడి నుంచి దూకేశాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి, అనంతరం తల్లి లోయలో పడి మృతి చెందిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి (iPhone EMI Maharashtra).
ఐఫోన్ ఈఎంఐ వివాదం ఒక్కటే ఈ విషాదానికి కారణం కాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కునాల్ గతేడాది కూడా ఛత్రపతి సంభాజీనగర్‌లోని అదే కొండ ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో పోలీసులు అతడిని ఒప్పించి వెనక్కి తీసుకువచ్చారు. అయితే ఈసారి పోలీసులు అతడిని ఆపలేకపోయారు. ఈ కుటుంబంలో కొంతకాలంగా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఆరేళ్ల క్రితం పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆ విషాదం తర్వాత కునాల్ తల్లిదండ్రులు కూడా మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం (Chhatrapati Sambhajinagar tragedy).
ఇటీవల కునాల్ ఐఫోన్ కొనుగోలు చేశాడు (Maharashtra hill tragedy). దాని ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో తండ్రితో గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఈ విషయంపై తండ్రితో వాగ్వాదం జరిగిన తర్వాత కునాల్ కొండపైకి వెళ్లినట్లు సమాచారం. ఐఫోన్ ఈఎంఐ వివాదంతో పాటు కుటుంబంలో కొనసాగుతున్న మానసిక, వ్యక్తిగత ఒత్తిళ్లు ఈ విషాదం వెనక ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
భర్తను చంపేసి పేగులను బయటకు తీసి.. హర్యానాలో ఓ మహిళ దారుణం..
స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..