తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన ప్రకటన..
ABN , Publish Date - May 07 , 2026 | 10:12 AM
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు నెలల వరకూ తాము అడ్డుకోమంటూ ప్రకటించారు.
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆరు నెలల వరకూ తాము అడ్డుకోమంటూ ప్రకటించారు. తమ పార్టీ ఎలాంటి రాజ్యాంగ సంక్షోభాన్ని కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. 'విజయ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం మాకు వద్దు' అంటూ స్టాలిన్ పేర్కొన్నారు.
డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలను విజయ్ కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందని తాను ఆశిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు. టీవీకే తన ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన కీలక హామీలనూ అమలు చేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను టీవీకే నెరవేర్చగలదా, లేదా? అనేది వేచి చూస్తామనీ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల ఉచిత అల్పాహార పథకాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని విజయ్ చెప్పారని.. అయితే, ఆ హామీ అమలు చేయడం కష్టమేనని పేర్కొన్నారు. కనీసం తామిచ్చిన రూ.1000 అయినా మహిళలకు అందించాలని సూచించారు. డీఎంకే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశామని.. కేంద్రం వల్లే 'నీట్' రద్దు సాధ్యం కాలేదని స్టాలిన్ చెప్పుకొచ్చారు.
స్టాలిన్ తాజా ప్రకటనతో తమిళనాడు రాజకీయాలు మరో కొత్త మలుపు తీసుకున్నాయి. బుధవారం రాత్రి వరకూ రిసార్ట్ రాజకీయాలు నడిచినట్లు ప్రచారం జరిగింది. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ఇతర చిన్నచిన్న పార్టీలను కలపుకుని మెుత్తం 120 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జోరుగా ప్రచారం జరిగింది. స్టాలిన్ తాజా ప్రకటనతో ఆ ఉహాగానాలకు చెక్ పడినట్లు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..
చంద్రనాథ్ రథ్ హత్యను ఖండించిన సువేందు అధికారి..