దాంపత్య వివాదాలతో భర్త ఉద్యోగ యజమానికి ఫిర్యాదు చేయొద్దు: సుప్రీంకోర్టు..
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:35 PM
దాంపత్య వివాదాలతో భర్త పనిచేస్తున్న సంస్థకు లేదా యజమానికి భార్య ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటి ఫిర్యాదుల వల్ల భర్త ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, భార్య భరణం (మెయింటెనెన్స్)పైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: దాంపత్య వివాదాలతో భర్త పనిచేస్తున్న సంస్థకు లేదా యజమానికి భార్య ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలతో భర్త ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, భార్య భరణం (మెయింటెనెన్స్)పైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహాదేవన్‌ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అసోంలో తనపై నమోదైన పరువునష్టం దావాను ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను విచారించే సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
గాజియాబాద్‌లో మహిళకు తన భర్తతో పలు న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టుకు మహిళ తరఫు న్యాయవాది తెలిపారు. అదే సమయంలో భర్త స్నేహితుడు ఆమెపై అస్సాంలో పరువునష్టం కేసు దాఖలు చేశాడని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసును గాజియాబాద్‌కు బదిలీ చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. ఇటీవల చాలా మంది మహిళలు దాంపత్య కలహాలతో భర్తల యజమానులకు ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో వారు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. జీవిత భాగస్వామి జీవనోపాధిని దెబ్బతీయడం తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు. భర్త ఉద్యోగం కోల్పోతే భార్య భవిష్యత్తులో భరణం కోరేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని సూచించారు.
ఈ కేసులో ఢిల్లీలోని వైమానిక దళ అధికారులకు మహిళ ఫిర్యాదు చేస్తూ తన భర్త ఎయిర్‌ఫోర్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నారని మహిళ ఆరోపించింది. దీనిపైనే పరువునష్టం కేసు నమోదైంది. అయితే, భార్య, ఆమె సోదరుడిపై ఎయిర్‌ఫోర్స్ హెల్మెట్ చోరీ చేశారంటూ భర్త తప్పుడు ఫిర్యాదు చేశారని, ఆ హెల్మెట్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికే అధికారులకు ఆమె వినతిపత్రం ఇచ్చిందని మహిళ తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా, పరువునష్టం కేసును భర్త కాకుండా ఆయన స్నేహితుడు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరు పక్షాల మధ్య రాజీ అవకాశాలను పరిశీలించేందుకు ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి ధర్మాసనం పంపించింది. అన్ని వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుని, పరస్పరం చేసుకున్న ఆరోపణలను ఉపసంహరించుకునేలా మహిళకు సూచించాలని న్యాయవాదికి జస్టిస్ నాగరత్న చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఢిల్లీలో అగ్నిప్రమాదం... ముగ్గురి మృతి