Share News

భారీ జరిమానా విధిస్తాం!

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:17 AM

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనులకు సంబంధించి యాక్ట్‌ (ఏసీటీ) పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో విచారణ జరుగుతుండగానే..

భారీ జరిమానా విధిస్తాం!

  • హైకోర్టులో విచారణ జరుగుతున్నా ఎందుకు వచ్చారు?

  • మెట్రో ఫేజ్‌-2 మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనులకు సంబంధించి యాక్ట్‌ (ఏసీటీ) పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో విచారణ జరుగుతుండగానే.. తమ వద్దకు రావటం ఏమిటని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు వేసినందుకు భారీ జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2 (కారిడార్‌-6)లో భాగంగా పాతబస్తీలోని చార్మినార్‌, ఫలక్‌నుమా మొదలైన ప్రాంతాల మీదుగా మెట్రో మార్గం వెళ్తుందని, దీనివల్ల దాదాపు 150 చారిత్రక కట్టడాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏసీటీ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసింది. హెరిటేజ్‌ కమిటీ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొంది. దీనిపై స్పందించిన హైకోర్టు.. మెట్రో అధికారులు సమర్పించిన స్పష్టమైన ప్రణాళికలు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లను పరిశీలించి విచారణ జరుపుతోంది. ఈ ప్రక్రియ సాగుతుండగానే పిటిషనర్‌ సంస్థ గత నెల 16వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ పామిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందని సందేహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు వేసినందుకు భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. కాగా, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేదని, నిబంధనల ప్రకారమే మెట్రో రెండో దశ పనులు జరుగుతున్నాయని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 06:17 AM