ఎస్‌ఐఆర్ రాజ్యాంగబద్ధం
ABN , Publish Date - May 28 , 2026 | 05:58 AM
ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్‌ఐఆర్) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షించే అధికారం ఎన్నికల సంఘానికి(ఈసీ) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 324 అధికరణ...
దానిని నిర్వహించే అధికారం ఈసీకి ఉంది .. ఈసీ పక్షపాత ధోరణి చూపలేదు
ఎస్‌ఐఆర్ వ్యతిరేక పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్‌ఐఆర్) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షించే అధికారం ఎన్నికల సంఘానికి(ఈసీ) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 324 అధికరణ కింద ప్రజాప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా ఎస్‌ఐఆర్‌ను ఈసీ నిర్వహించవచ్చని తెలిపింది. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని నిర్దేశిస్తున్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఈసీ ఎస్‌ఐఆర్‌ను నిర్వహిస్తున్నదని కితాబునిచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం బుధవారం 124 పేజీల తీర్పును వెలువరించింది. బిహార్‌లో ఎస్‌ఐఆర్ నిర్వహణకు సంబంధించి గతేడాది జూన్‌లో ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని.. అయితే, పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఉందని, కచ్చితమైన ఎన్నికల జాబితాను రూపొందించేందుకు అది ఉపయోగపడుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికల జాబితా విశ్వసనీయత, కచ్చితత్వం, సమగ్రతను కాపాడేందుకే కమిషన్ ఎస్‌ఐఆర్‌ను చేపట్టిందని, దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను పటిష్ఠం చేసేందుకు ఇది తోడ్పడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని 324 అధికరణ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం అసాధారణమైన పరిస్థితుల్లో ఓటర్ల జాబితాపై ఈసీ ప్రత్యేక సవరణను నిర్వహించవచ్చుననని తెలిపింది. సెక్షన్ 21(2) ప్రకారం జరిపే సాధారణ సవరణ కంటే ఇది భిన్నమైందని పేర్కొంది. దేశంలో ఎస్‌ఐఆర్ జరిగి రెండు దశాబ్దాలకుపైగా గడిచిందని, ఈ మధ్య కాలంలో పట్టణీకరణ, వలసలు పెరిగాయని, తద్వారా ఒకే వ్యక్తి పేరు మీద పలు చోట్ల ఓట్లు ఉండటం, తప్పుడు వివరాలు నమోదు కావటం వంటివి ఉన్నాయని గుర్తు చేసింది.
ఓటర్లకు అనేక మార్గాలు
ఓటర్ల జాబితా కచ్చితంగా, సంపూర్ణంగా, సమగ్రంగా ఉండేలా చూసేందుకు ఈసీ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించిందని ధర్మాసనం తెలిపింది. ఓటర్లు తమ హక్కును నిర్ధారించేందుకు వారికి ఈసీ అనేక మార్గాలను కల్పించిందని, వారి సమస్యల పరిష్కారానికి పూర్తిగా సహకరించిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎక్కడా ఈసీ పక్షపాత వైఖరిని, అధికార దుర్వినియోగాన్ని ప్రదర్శించలేదని స్పష్టం చేసింది. పౌరసత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని ఓటర్లను కోరినంత మాత్రాన ఈసీ చట్టవ్యతిరేకంగా వ్యవహరించినట్లు కాదని తెలిపింది. ఓటు హక్కు నిర్ధారణ కోసం 11 రకాల పత్రాలను ఎస్‌ఐఆర్‌లో బాగంగా నిర్ణయించారని, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కును ఈసీ నిరాకరించలేదని తెలిపింది. తమ ఆదేశాల మేరకు 12వ డాక్యుమెంట్‌గా అధార్‌కార్డును చేర్చిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే, ఆధార్‌ను కలిగి ఉన్నంత మాత్రాన భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కాబట్టి, ఆధార్‌ను పరిపూర్ణమైన సాక్ష్యాధారంగా పరిగణించలేమని, ఓటరు అర్హతను నిర్ణయించటానికి ఇతర ధ్రువీకరణ పత్రాలు కూడా తీసుకురావాలని అధికారులు కోరవచ్చని తెలిపింది. అలాగే, రేషన్‌కార్డుల దుర్వినియోగం దృష్ట్యా.. వాటిని కూడా ఎస్‌ఐఆర్ ధ్రువీకరణ పత్రాల జాబితాలో చేర్చలేమన్న ఈసీ వాదనను కోర్టు సమర్థించింది. పాస్‌పోర్టు, బర్త్ సర్టిఫికేట్‌లాగా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని రేషన్‌కార్డు నిరూపించలేదని పేర్కొంది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఏయే పత్రాలను ఆధారాలుగా పరిగణించాలి అన్న విచక్షణాధికారం పూర్తిగా ఈసీదేనని తెలిపింది. ఓటరు జాబితా నుంచి ఈసీ ఒకరిని తొలగించినంత మాత్రాన ఆ వ్యక్తి పౌరసత్వాన్ని కోల్పోయినట్లు కాదని పేర్కొంది.
తీర్పు దారుణం.. పిటిషనర్ల ఆందోళన
సుప్రీంకోర్టు తీర్పుపై పిటిషనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఓటర్లను ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు సుప్రీంకోర్టు స్వయంగా ఆమోదముద్ర వేయడం దారుణమని విమర్శించారు. తీర్పు చాలా నిరాశజనకంగా ఉందని ఏడీఆర్ అధినేత మేజర్ జనరల్ అనిల్‌వర్మ వ్యాఖ్యానించారు. ఈసీ పక్షపాత విధానాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం వల్ల కోట్లాది మంది ఓటర్ల పరిస్థితి అయోమయంలో పడిందని ఎంపీ మహువా మెయిత్రా చెప్పారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ తర్వాత 27 లక్షల మంది ఓటుహక్కును కోల్పోయారన్నారు. ఎస్‌ఐఆర్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా బిహార్ ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతించినప్పుడే కోర్టు వైఖరి స్పష్టమైందని.. అందుకే తాను ఈ వ్యాజ్యానికి దూరంగా ఉన్నానని యోగేంద్రయాదవ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఆఖరి స్తంభం కూడా నేడు కూలిపోయిందని, ఇకపై దేశంలో ఎవరు ఓటు వేయాలో, ఎవరు వేయవద్దో బీజేపీ నిర్ణయిస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్‌ఐఆర్‌కు చట్టబద్ధత లభించవచ్చని, కానీ, ఆ ప్రక్రియ అమలులో తలెత్తుతున్న సమస్యలకు అది పరిష్కారం చూపదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్‌సింఘ్వీ పేర్కొన్నారు. తీర్పును బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ఇన్నాళ్లూ భారతీయ ఓటర్ల వెంట కాకుండా.. అక్రమ చొరబాటుదారుల వెంట ఉన్నారని, అందుకనే ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకించారని ఇప్పుడు స్పష్టమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిపేందుకు ఓటర్ల జాబితాను సవరించడం సరైన చర్య అన్నది సుప్రీం తీర్పుతో స్పష్టమైందని బీజేపీ మరో అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు.
కాంగ్రెస్‌కు చెంపపెట్టు: ఎంపీ కె.లక్ష్మణ్ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి చెంపపెట్టు వంటిదని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఇన్నాళ్లూ విపక్షాలు చేసిన అబద్ధాల,దుష్ప్రచార పునాదులు కూలిపోయాయన్నారు. ఓట్ల చోరీ జరుగుతోందంటూ, ప్రజాస్వామ్యసంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలన్నీ నిరాధారమైనవని రుజువైందని లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలలో ఘోర పరాజయాల్ని జీర్ణించుకోలేకనే, కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయన్నారు. సుప్రీం తీర్పుతోనైనా వాస్తవాలను గ్రహించి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News