శిక్షపై స్టే కేవలం ఎన్నికల కోసం కాదు.. సుప్రీంలో ఆజం ఖాన్ కుటుంబానికి ఊరట
ABN , Publish Date - Nov 18 , 2026 | 03:45 PM
శిక్షపై స్టే కేవలం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాదని సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆజం ఖాన్ కుటుంబానికి భారీ ఊరటనిస్తూ.. భార్య, కుమారుడి శిక్షలపై స్టే మంజూరు చేసింది.
ఢిల్లీ, నవంబర్ 18: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు కేవలం ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే తమ శిక్షపై స్టే కోరడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కన్విక్షన్ స్టే అనేది సాధారణ హక్కు కాదని, కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వదగిన ప్రత్యేక వెసులుబాటని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన కుటుంబ సభ్యుల కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
చట్టసభల పవిత్రతను, నైతిక విలువలను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరస్థులు రాజకీయాల్లో కొనసాగడాన్ని తేలికగా తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల రాజకీయ భవిష్యత్తు లేదా ఎన్నికల్లో పోటీ చేసే ఆకాంక్షలను బట్టి కోర్టులు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించలేవని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
మరోవైపు, ఆజం ఖాన్ శిక్షపై అలహాబాద్ హైకోర్టు విధించిన స్టేను రద్దు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అదే సమయంలో, ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాత్మా, కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు అనుమతించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వారి రివిజన్ పిటిషన్లు తేలే వరకు, వారి శిక్షలపై కూడా స్టే విధిస్తూ ధర్మాసనం వారికి భారీ ఊరట కల్పించింది. (Azam Khan Supreme Court)
అసలు కేసేంటి?
ఆజం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాత్మా కలిసి తమ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ కోసం వేర్వేరు పుట్టిన తేదీలతో రెండు జనన ధృవీకరణ పత్రాలను (Birth Certificates) అక్రమంగా పొందారన్నది ప్రధాన ఆరోపణ. మొదటి సర్టిఫికెట్ (రాంపూర్ మున్సిపాలిటీ జారీ చేసినది) ప్రకారం అబ్దుల్లా పుట్టిన తేదీ జనవరి 1, 1993గా ఉంది. రెండో సర్టిఫికెట్ (లక్నో మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసినది) ప్రకారం పుట్టిన తేదీ సెప్టెంబర్ 30, 1990గా నమోదైంది.
ఎందుకు ఇలా చేశారు?
2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సువార్ (Suar) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అబ్దుల్లాకు కనీస వయసు (25 ఏళ్లు) ఉండాలి. 1993 ప్రకారం ఆయనకు ఎన్నికల నాటికి 25 ఏళ్లు నిండవు కాబట్టి, ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రభుత్వ రికార్డుల కోసం 1990 తేదీతో మరో సర్టిఫికెట్ సృష్టించారని, పాస్‌పోర్ట్ కోసం 1993 సర్టిఫికెట్ వాడారని ఆరోపణలు వచ్చాయి.
కేసు నమోదు, కింది కోర్టు తీర్పు
ఫిర్యాదు: 2019 జనవరి 3న బీజేపీ నేత (ప్రస్తుత రాంపూర్ ఎమ్మెల్యే) ఆకాశ్ సక్సేనా ఈ నకిలీ సర్టిఫికెట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు అక్టోబర్ 18, 2023న ఆజం ఖాన్, తజీన్ ఫాత్మా, అబ్దుల్లా ఆజం ఖాన్‌లను దోషులుగా తేల్చింది. చీటింగ్ (సెక్షన్ 420), ఫోర్జరీ (సెక్షన్ 467, 468, 471), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120B) కింద ముగ్గురికీ 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
హైకోర్టు, సుప్రీంకోర్టు పరిణామాలు
అలహాబాద్ హైకోర్టు: కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. మే 24, 2024న హైకోర్టు వీరి ముగ్గురి జైలు శిక్షను నిలిపివేసి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దోషిగా నిర్ధారించడంపై (Conviction) స్టే ఇచ్చే విషయంలో కేవలం ఆజం ఖాన్‌కు మాత్రమే స్టే ఇచ్చి, ఆయన భార్య, కుమారుడికి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పు: ఆజం ఖాన్‌కు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని యూపీ ప్రభుత్వం, తమకూ స్టే ఇవ్వాలని తజీన్ ఫాత్మా, అబ్దుల్లా ఆజం ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగుల ధర్మాసనం.. యూపీ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేస్తూ, ఆజం ఖాన్ భార్య, కుమారుడి శిక్షలపై కూడా హైకోర్టులో రివిజన్ పిటిషన్లు తేలే వరకు స్టే విధిస్తూ ఊరట కల్పించింది.
ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్ కేసుతో పాటు ఆజం ఖాన్‌పై జౌహర్ యూనివర్సిటీ భూ ఆక్రమణలు, విద్వేషపూరిత ప్రసంగాలు (Hate Speech), మనీలాండరింగ్ వంటి మరికొన్ని కేసులు కూడా వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..