Share News

రిలయన్స్-కేంద్రం మధ్య కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. మధ్యవర్తిగా మాజీ న్యాయమూర్తి..

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:27 PM

కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో సహజ వాయువు వెలికితీతకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

రిలయన్స్-కేంద్రం మధ్య కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. మధ్యవర్తిగా మాజీ న్యాయమూర్తి..
KG Basin Gas Dispute, Supreme Court,

ఇంటర్నెట్ డెస్క్: కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో సహజ వాయువు వెలికితీతకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో మధ్యవర్తిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇరు పక్షాలు సూచించే ఇద్దరు నిపుణుల సహాయం కూడా తీసుకోవాలని స్పష్టం చేసింది (KG Basin Gas Dispute).


ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు పక్షాలు గతంలో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, ఒక అంగీకారానికి రాలేకపోయాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ (Justice Ranjana Prakash Desai) మధ్యవర్తిత్వంలో ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాలని సూచించింది. రాతపూర్వకంగా, మౌఖికంగా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని తెలిపింది. ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియకు నిర్దిష్ట గడువును విధించలేదు. నాలుగు వారాల తర్వాత కేసును మరోసారి విచారించి, అప్పటికి మధ్యవర్తిత్వంలో సాధించిన పురోగతిని తెలియజేయాలని ఆదేశించింది.


ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి బేసిన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహజ వాయువు వెలికితీత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ క్షేత్రాల్లోని సహజ వాయువు రిలయన్స్ నిర్వహిస్తున్న క్షేత్రంలోకి ప్రవహించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ గ్యాస్‌ను రిలయన్స్ వెలికితీసి విక్రయించిందని ఓఎన్‌జీసీ, కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశాయి (Reliance Government Dispute).


ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది (KG Basin Gas Extraction). ఈ కమిటీ నివేదిక ఆధారంగా రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థల నుంచి సుమారు రూ.12,800 కోట్ల మొత్తాన్ని వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆరోపణలను రిలయన్స్ అంగీకరించలేదు. ఈ కేసులో ఇరు పక్షాల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో మధ్యవర్తిత్వ ప్రక్రియ ప్రారంభం కానుంది.


ఇవి కూడా చదవండి..

పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు!


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 30 , 2026 | 12:33 PM