ఫారం-6, 7, 8లను ఈసీ సవరించడానికి వీల్లేదు!
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:27 AM
కొత్త ఓట్ల నమోదుకు ఉద్దేశించిన ఫామ్-6లో ఎన్నికల కమిషన్ (ఈసీ) ఎలాంటి సవరణలూ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
తొలగించిన ఓటర్లను మళ్లీ ఫారం-6 అడగడమెందుకు: సుప్రీం
ఢిల్లీలో ఎన్నికల్లేవు కదా!.. 30లోగా పూరించాలని గడువెందుకు?
మళ్లీ ఓటు నమోదుకు కటాఫ్ డేట్ పెట్టొద్దు.. ఈసీకి కోర్టు ఆదేశం
తొలగించిన 47 లక్షల ఓటర్ల జాబితాను ప్రచురించండి
ఈసీకి జస్టిస్ బాగ్చి సూచన.. విచారణ రెండు వారాలకు వాయిదా
న్యూఢిల్లీ, అక్టోబరు 28: కొత్త ఓట్ల నమోదుకు ఉద్దేశించిన ఫామ్-6లో ఎన్నికల కమిషన్ (ఈసీ) ఎలాంటి సవరణలూ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఓటరుగా జాబితాలో ఫలానా పేరు చేర్చడంపై అభ్యంతరం చెప్పడానికి నింపే ఫామ్-7, ఇప్పుడున్న చోట నుంచి వేరే చోటకు ఓటు మార్చుకోవడానికి దరఖాస్తు చేసే ఫామ్-8లను కూడా సవరించడం కుదరదని, నిర్దిష్ట ఫార్మాట్‌లో ఉన్న ఈ మూడు పత్రాలను మార్చరాదని తేల్చిచెప్పింది. ఢిల్లీలో సర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈసీకి పలు ప్రశ్నలు సంధించింది.
‘ఫామ్-6 కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించింది. కానీ ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించని కారణంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించినవారిని.. మళ్లీ ఫామ్-6 నింపాలని ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీలో సమీప భవిష్యత్‌లో ఏ ఎన్నికలూ లేవు కదా! పేర్ల రీ-ఎన్‌రోల్‌మెంట్‌కు ఈ నెల 30 వరకు గడువు విధించడమెందుకు? ఎలాంటి కటాఫ్ డేట్ పెట్టొద్దు’ అని ఈసీని ఆదేశించింది. పూర్వపు ఓటర్ల జాబితాలో పేరుండి ఇప్పుడు లేనివారి కోసం.. మళ్లీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం కాకుండా.. వేరే ప్రత్యామ్నాయ పరిష్కారం కనుగొనాలని హితవు పలికింది. ధర్మాసనం లేవనెత్తిన అంశాలను కమిషన్ చర్చిస్తుందని.. దిద్దుబాటు చర్యలు చేపడుతుందని కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది శేషాద్రినాయుడు తెలిపారు. పిటిషనర్ల తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ..ఢిల్లీలో ‘సర్’ ప్రక్రియను మొదలుపెట్టినప్పుడు మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 97 లక్షల మంది ఎన్యుమరేషన్ పత్రాలను ఈసీకి సమర్పించారని.. 47 లక్షల మంది నుంచి అందలేదని వివరించారు.
ఓటుహక్కు కీలక హక్కు..
‘ఓటు హక్కు చాలా కీలకమైన హక్కు. ఎన్యుమరేషన్ పత్రం సమర్పించనంత మాత్రాన ఆ హక్కును ఎప్పటికీ కోల్పోవలసిందేనా’ అని జస్టిస్ బాగ్చీ ప్రశ్నించారు. 47లక్షల గ్యాప్‌ను తగ్గించడానికి కమిషన్ ప్రయత్నించాలని.. వారి పేర్లతో జాబితాను ప్రచురించి.. వారి ఆచూకీ తెలియడం లేదని.. వారే సమీపంలోని బీఎల్‌వోలను సంప్రదించి.. ఫామ్-8 నింపాల్సిందిగా అందులో పేర్కొనాలని సూచించారు. ఫామ్-6, ఫామ్-8లను ఎప్పుడైనా తీసుకుంటామని వారికి తెలియజేయాలని సీజేఐ అన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం 2వారాలు వాయిదావేసింది.
వాళ్లకు ఎన్నికలు నిర్వహించిన అనుభవం లేదు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధూ, వివేక్ జోషిల నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కొత్త మలుపు తిరిగింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా సంపాదించిన వివరాలను పిటిషనర్ తాజాగా న్యాయస్థానం ముందుంచారు. అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉందా లేదా, వారి నిజాయతీ (ఇంటెగ్రిటీ) ఎలాంటిదనే అంశాలను ఎంపిక కమిటీలు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికే దాఖలు చేసిన తన రిట్ పిటిషన్‌ను సవరించేందుకు అనుమతించాలంటూ పిటిషనర్ సూరి పయాల.. అదనపు దరఖాస్తును సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి