సత్వర విచారణ కుదరదు షాహీన్‌నగర్ ఫాంహౌస్ కేసులో సుప్రీంకోర్టు
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:48 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన షాహీన్‌నగర్ ఫాంహౌస్ దోపిడీ కేసుపై సత్వరమే విచారణ జరపడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన షాహీన్‌నగర్ ఫాంహౌస్ దోపిడీ కేసుపై సత్వరమే విచారణ జరపడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులు అనారోగ్యంతో బాధపడుతున్నందున కేసును త్వరగా విచారించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. అవసరమనుకుంటే అనారోగ్య కారణాలను చూపించి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 2014 జూలై 31న హైదరాబాద్‌లోని షాహీన్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఫాంహౌస్‌లో పెళ్లిచేసుకోబోయే ఓ యువకుడు, యువతిలను తయ్యబ్ బసలమా, ఫైసల్ దయ్యానితో సహా మొత్తం ఏడుగురు బెదిరించి ఇనుప రాడ్లతో చిత్రహింసలు పెట్టారు. దుస్తులు తొలగించి ఫొటోలు తీశారు. నగదు, బంగారం దోచుకుని పరారయ్యారు. దీనిపై విచారణ జరిపిన ఎల్.బి.నగర్‌లోని ప్రత్యేక సెషన్స్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధిస్తూ 2016 తీర్పు చెప్పింది. దీనిని హైకోర్టు సైతం సమర్థించింది. దీనిపై వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నందున కేసును త్వరగా విచారించాలని కోరుతూ తయ్యబ్ బసలమా, ఫైసల్ దయ్యానిలు సుప్రీంకోర్టును కోరారు. దానిపై శుక్రవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.