Share News

మధ్యవర్తిత్వం సాకుతో విచారణ ఆపలేం

ABN , Publish Date - May 21 , 2026 | 05:04 AM

కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌ పరిధిలో సహజవాయువు అక్రమ తరలింపు వివాదంపై తాము చేపట్టిన విచారణను మధ్యవర్తిత్వ ప్రతిపాదనల సాకుతో నిలిపివేయలేమని సుప్రీంకోర్టు...

మధ్యవర్తిత్వం సాకుతో విచారణ ఆపలేం

  • కేజీ బేసిన్‌ గ్యాస్‌ వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌ పరిధిలో సహజవాయువు అక్రమ తరలింపు వివాదంపై తాము చేపట్టిన విచారణను మధ్యవర్తిత్వ ప్రతిపాదనల సాకుతో నిలిపివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రిలయన్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు లేదా మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని, అందువల్ల విచారణను తాత్కాలికంగా ఆపాలని రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నేతృత్వంలోని కన్సార్టియం కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌జీసీ తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి వాదించారు. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీకి కేటాయించిన బ్లాక్‌ నుంచి రిలయన్స్‌ కన్సార్టియం అక్రమంగా గ్యాస్‌ను తరలించిందని ఆరోపించారు. ఇందుకు గాను ఆ కన్సార్టియం నుంచి వడ్డీతో కలిపి 1.5 బిలియన్‌ డాలర్లను రికవరీ చేయాలని కోర్టుకు నివేదించారు. రిలయన్స్‌ తరఫున అభిషేక్‌ మను సింఘ్వి ఈ వాదనను తోసిపుచ్చారు. సముద్ర గర్భంలో 2 వేల అడుగుల లోతులోఎలాంటి కృత్రిమ సరిహద్దులు నిర్మించడం సాధ్యం కాదని తెలిపారు. సముద్ర గర్భంలో ఉండే సహజ పీడన వ్యత్యాసాల కారణంగా ఒక బ్లాక్‌ నుంచి మరో బ్లాక్‌లోకి గ్యాస్‌ వెళ్లటం పూర్తిగా సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. అయినప్పటికీ వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు లేదా మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో ఒక ఖచ్చితమైన పరిష్కారానికి వచ్చి కోర్టుకు తెలిపితేనే విచారణ ముగిస్తామని తేల్చి చెప్పింది.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:05 AM