పాత నియామకాలకు ఢోకా లేదు
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:34 AM
ఓబీసీ క్రీమీలేయర్ వర్తింపునకు సంబంధించి దేశవ్యాప్తంగా గతంలోనే జరిగిన నియామకాలు, పదోన్నతులకు, సీనియారిటీలకు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది
గత పదోన్నతులు, సీనియారిటీలు,
విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఓబీసీ క్రీమీలేయర్ కొత్త మార్గదర్శకాల వర్తింపు వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ, నవంబరు 6: ఓబీసీ క్రీమీలేయర్ వర్తింపునకు సంబంధించి దేశవ్యాప్తంగా గతంలోనే జరిగిన నియామకాలు, పదోన్నతులకు, సీనియారిటీలకు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. వాటికి కొత్త మార్గదర్శకాలు వర్తింపజేయాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే ఓబీసీ క్రీమీలేయర్‌కు సంబంధించి ఇప్పటికే కోర్టుల్లో ఉన్న పిటిషన్ల విచారణలు కొనసాగించవచ్చని.. ఆయా కేసుల్లో మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు జసిస్ నరసింహ, మహదేవన్‌ల ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నియామకాలు, పదోన్నతులలో రిజర్వేషన్లకు సంబంధించి ఓబీసీ క్రీమీలేయర్ కింద కేవలం సదరు అభ్యర్థి, వారి తల్లిదండ్రుల ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదని.. వారు ప్రైవేటు/ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న హోదా, ఉద్యోగం కేటగిరీని కూడా పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో విచారణ జరిపింది. పిటిషన్లకు అనుకూలంగా ఈ ఏడాది మార్చి 11న తీర్పు ఇచ్చింది. మొత్తంగా ఓబీసీ క్రీమీలేయర్‌కు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే జరిగిపోయిన నియామకాలు, పదోన్నతులు, అడ్మిషన్లకు ఈ తీర్పును వర్తింపజేస్తే.. విపరీత పరిణామాలు తలెత్తుతాయని.. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేంద్రం వివరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. అయితే కొత్త మార్గదర్శకాల రూపకల్పన కోసం రెండేళ్లు గడువు ఇవ్వాలని కేంద్రం ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాల సమాన హోదాను నిర్ణయించేందుకు సమయం అవసరమని పేర్కొంది.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.