డిజిటల్ అరెస్టు కేసుల్లో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీం
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:05 AM
అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే డిజిటల్ అరెస్టు కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి తాము వ్యతిరేకమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ, జూలై 28: అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే డిజిటల్ అరెస్టు కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి తాము వ్యతిరేకమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు తన వైఖరిని ట్రయల్ కోర్టులు, హైకోర్టులకు తెలియజేసింది. డిజిటల్ అరెస్టు చాలా తీవ్రమైన నేరమని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కష్టార్జితాన్ని హరించేదని ధర్మాసనం పేర్కొంది. ఇది బందిపోటు దోపిడీతో సమానమైనదని వ్యాఖ్యానించింది. అందువల్ల వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని పోలీసులకు సూచించింది. డిజిటల్ అరెస్టు కేసులో ప్రధాన నిందితుడికి బ్యాంకు ఖాతా తెరవడంలో సహకరించానే తప్ప, ఎలాంటి నేరం చేయలేదని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఓ వ్యక్తి చేసిన వినతిని తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.