పోలీసుల తీరుపై విచారిస్తాం
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:43 AM
ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విద్యార్థుల మీద పోలీసుల బలప్రయోగంపై సుప్రీంకోర్టు స్పందించింది. పోలీసుల అణచివేత చర్యలను సవాలు చేస్తూ...
విద్యార్థులపై బలప్రయోగం పిటిషన్లను సోమవారం విచారణ జాబితాలో పెడతాం
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ వెల్లడి
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను తాము పరిశీలిస్తామని స్పష్టీకరణ
పోలీసుల క్రౌర్యంపై అసలు పిటిషనే దాఖలు కాలేదు
అత్యవసర విచారణకు మేం తిరస్కరించాం అంటూ బాధ్యతారహితంగా వార్తలు
జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం
‘చలో పార్లమెంట్’లో విద్యార్థుల హింసపై ఎన్‌ఐఏ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విద్యార్థుల మీద పోలీసుల బలప్రయోగంపై సుప్రీంకోర్టు స్పందించింది. పోలీసుల అణచివేత చర్యలను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం (జూలై 27న) విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. సిజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ శుక్రవారం ఈ విషయాన్ని అత్యవసరంగా ప్రస్తావించారు. ‘‘దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై రెండు ప్రత్యేక పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారం తయారైన ఈ పిటిషన్లలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలనూ ప్రతివాదులుగా చేర్చాం’’ అని ధర్మాసనానికి వివరించారు. బాధ్యతాయుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై రోజూ ఏదో ఒకచోట పోలీసులు విచక్షణారహితంగా బలాన్ని ఉపయోగిస్తున్నారని, దీనిని నిరోధించేందుకు న్యాయస్థానం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ‘‘పోలీసుల దౌర్జన్యాలకు, పౌరులకు మధ్య ఒక్క కోర్టు మాత్రమే రక్షణగా నిలుస్తుంది’’ అని స్పష్టం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్య కాంత్.. పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నామని, సోమవారం విచారిస్తామని వెల్లడించారు.
అసలు కారణం అదే..
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేయడానికి, ఎన్టీయే వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్రం తీసుకునే చర్యలను తాము నిశితంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి.. నీట్ పరీక్ష నిర్వహణలో పారదర్శకతకు తీసుకున్న చర్యలు, రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసుల అమలు గురించి వివరించాలని ఆదేశించింది. ‘‘నీట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లోకి మార్చడానికి మీరేం చేస్తున్నారో మాకు చెప్పండి’’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ మెహతా.. రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులకు మించి.. ప్రభుత్వం పది అడుగులు ముందుందని కోర్టుకు తెలిపారు. పరీక్షల విధానంలో తీసుకురానున్న సమగ్ర మార్పులపై ప్రభుత్వం త్వరలోనే సవివర నివేదికను ఫైల్ చేస్తుందని తెలిపారు. ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, కాక్రోచ్ జనతాపార్టీ నిర్వహించిన ‘చలో పార్లమెంట్’లో జరిగిన హింసపై ఎన్‌ఐఏ లేదా సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఏ కేసునైనా ఎన్‌ఐఏ దర్యాప్తునకు అప్పగించాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, కోర్టు పరిధిలోనిది కాదని పేర్కొంది. సంబంధిత అధికారులను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రాథమిక దర్యాప్తు సంస్థ విచారణపై సంతృప్తి చెందకపోతే అప్పుడు సీబీఐతో విచారణకు ఆదేశిస్తామని తెలిపింది.
మీడియాపై సీజేఐ ఆగ్రహం..
విద్యార్థులపై పోలీసుల క్రౌర్యానికి సంబంధించి అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ వస్తున్న వార్తలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల దాకా సుప్రీంకోర్టు ముందు అలాంటి పిటిషన్ ఏదీ దాఖలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘అది మిశ్రానో మరొకరో.. చేసిన అభ్యర్థన మాత్రమే. ఒక అభ్యర్థనను రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణిస్తాం? దానిపై బాధ్యతారహితంగా వార్తలు రాయడం మొదలుపెట్టారు’’ అని సీజేఐ అన్నారు. ‘చలో పార్లమెంట్’లో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించిన వైనంపై సుమోటోగా అత్యవసర విచారణ చేపట్టాలంటూ నరేంద్ర మిశ్రా అనే న్యాయవాది మౌఖికంగా చేసిన విజ్ఞప్తిని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ..‘మా టైం వేస్ట్ చేయొద్దు...మీ టైమ్ కూడా వేస్ట్ చేసుకొవద్దు’ అని సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
అనుమతి లేకుండా కోర్టు విచారణల వీడియోలు పోస్టు చేయవద్దు
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు కార్యకలాపాల ఆడియో-వీడియో రికార్డింగ్‌లను సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో పోస్టు చేయడం, అప్‌లోడ్ చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. ఈమేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని దుర్వినియోగం చేయడం, వీడియోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడంపై దాఖలైన పిటిషన్ మేరకు.. కేంద్రం, ఇతరులు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. జడ్జిలు చేసే వ్యాఖ్యల వీడియోలు దుర్వినియోగం అవుతున్నాయని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News