ఏకపక్షంగా తీర్పు ఎలా ఇచ్చారు?
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:08 AM
నోటీసులు సరైన వ్యక్తికి అందనప్పుడు ఏకపక్షంగా (ఎక్స్‌పార్టే) తీర్పు ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ...
ఎవరికో నోటీసులు అందితే..
దాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?
గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం
మళ్లీ విచారణకు ఆదేశిస్తాం తదుపరి విచారణ 25న
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నోటీసులు సరైన వ్యక్తికి అందనప్పుడు ఏకపక్షంగా (ఎక్స్‌పార్టే) తీర్పు ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. 2018లో గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించారు. కృష్ణమోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, ఆయన ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత.. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ 2023 ఆగస్టులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికలో ఆయన తర్వాతి స్థానంలో నిలిచిన డీకే అరుణను 2018 డిసెంబరు 12 నుంచీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన కృష్ణమోహన్ రెడ్డికి రూ.2,50,000 జరిమానా విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఆగస్టు 31న కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదిత్యసోంధి, మోహిత్ రావు వాదిస్తూ.. హైకోర్టు జారీ చేసిన నోటీసులు తమ క్లయింట్‌కు కాకుండా బి.అనంతరెడ్డి అనే వ్యక్తికి అందాయని, అయినప్పటికీ హైకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆస్తులను దాచిపెట్టారన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. ‘ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయడానికి ముందే సంబంధిత భూమిని రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించాం. బ్యాంక్ ఖాతాల్లో కేవలం రూ. 16,000నుంచి రూ.18,000మాత్రమే ఉన్నాయి. ఇతర ప్రతివాదులకు పత్రికల ద్వారా నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. కృష్ణమోహన్‌రెడ్డి విషయంలో మాత్రం వివక్ష చూపించింది’ అని ఆరోపించారు. డీకే అరుణ తరఫు న్యాయవాది బినా మాధవన్ కలుగజేసుకుంటూ అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామాకే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు వెళ్లాయని తెలిపారు.
జనరల్ క్లాజెస్ యాక్ట్ ప్రకారం సరైన చిరునామాకు నోటీసులు పంపినప్పుడు, దాన్ని నోటీసులు అందినట్లుగానే పరిగణించాలని నివేదించారు. అయితే, డీకే అరుణ తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘నోటీసుల అక్నాలెడ్జ్‌మెంట్‌పై ఉన్నది కృష్ణమోహన్‌రెడ్డి సంతకం కానప్పుడు.. అతడికే నోటీసులు అందాయని ఎలా నిర్ధారిస్తారు?అని ప్రశ్నించింది. అక్నాలెడ్జ్‌మెంట్‌పై సంతకం తేడాను గమనించినప్పుడు హైకోర్టు మళ్లీ నో టీసులు ఇచ్చి ఉండాల్సిందని, లేదంటే పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వాల్సిందని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో ఎక్స్‌పార్టే తీర్పును కొట్టివేసి, మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. అయి తే, కొంత సమయం కావాలని డీకే అరుణ తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను ఈ నెల25కు వాయిదా వేసింది.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News