Share News

కోర్టుకే అబద్ధాలు చెబుతారా.. కమెడియన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు..

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:06 PM

కోర్టు ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియా, కంటెంట్ క్రియేటర్ ఆశిష్ చంచలానిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వీరు అమలు చేయకపోవడాన్ని తప్పుబడుతూ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది.

కోర్టుకే అబద్ధాలు చెబుతారా.. కమెడియన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు..
Samay Raina Case

న్యూఢిల్లీ: కోర్టు ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియా, కంటెంట్ క్రియేటర్ ఆశిష్ చంచలానిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వీరు అమలు చేయకపోవడాన్ని తప్పుబడుతూ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా కోర్టును సమయ్ రైనా తేలికగా తీసుకున్నారని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


న్యాయస్థానాన్ని సమయ్ రైనా మోసం చేసినట్టుగా వ్యవహరించాడని, తమ ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘించాడని ధర్మాసనం పేర్కొంది. గతేడాది ఆగస్టులో దివ్యాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై సమయ్ రైనా, అతని సహచర కమెడియన్లు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ పోడ్‌కాస్ట్‌లు, సోషల్ మీడియా వేదికల ద్వారా బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలని పేర్కొంది. అలాగే తాము భరించేందుకు సిద్ధంగా ఉన్న జరిమానా లేదా శిక్ష వివరాలను కూడా కోర్టుకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు 2026 మే 5న సమయ్ రైనా సహా ఐదుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్టాండ్-అప్ కమెడియన్లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.


ఈ సందర్భంగా దివ్యాంగులను కించపరిచే వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓ వర్గాన్ని లేదా సమాజంలోని ఏ వర్గాన్ని అవమానించే స్వేచ్ఛ ఎవరికీ లేదని వ్యాఖ్యానించింది. అలాంటి ప్రసంగాలపై చట్టపరమైన నియంత్రణ ఉంటుందని హెచ్చరించింది. అంతేకాకుండా తమ జీవితాల్లో స్ఫూర్తిదాయక విజయాలు సాధించిన దివ్యాంగుల కోసం సమయ్ రైనా తన వేదికలపై నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహించాలనీ గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహించి జరిమానా విధించింది.


ఈ వార్తలనూ చదవండి:

మోదీజీ.. కేతన్‌ను హత్య చేసిన వారిని వదిలిపెట్టొద్దు.. రాఖీ అగర్వాల్ భావోద్వేగ లేఖ..

రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!

Updated Date - Jul 14 , 2026 | 06:01 PM