మోదీజీ.. కేతన్‌ను హత్య చేసిన వారిని వదిలిపెట్టొద్దు.. రాఖీ అగర్వాల్ భావోద్వేగ లేఖ..
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:12 PM
పుణెలోని లోహగడ్ కోట వద్ద రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ భావోద్వేగ లేఖ రాశారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర: పుణెలోని లోహగడ్ కోట వద్ద రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. వివాహం ఇష్టం లేకపోవడంతో సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కాబోయే భర్త కేతన్‌ను హత్య చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ పోలీసులకు నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ తాజాగా ఓ భావోద్వేగ లేఖ రాశారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు.
లేఖలో ఏముందంటే..
'మోదీజీ.. నేను ఓ తల్లిని మాత్రమే. నాకు సానుభూతి అవసరం లేదు. ఎలాంటి ప్రత్యేక సహాయం కూడా కోరడం లేదు. నా కుమారుడిని చంపిన వారికి చట్టం ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చేసి న్యాయం చేయండి. ఈ కేసులో విచారణను వేగంగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి తల్లిలాగే నా కుమారుడు కేతన్ మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని, పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని, మా కళ్ల ముందే వృద్ధుడిగా మారాలని కలలు కన్నాను. కానీ నా చేతులతోనే అతనికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. కేతన్ మరణంతో నా జీవితం శూన్యంగా మారిపోయింది. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. అతనితో పాటే నా ప్రపంచమంతా ముగిసిపోయింది. ఇంట్లో ప్రతి మూల కేతన్‌నే గుర్తు చేస్తోంది.
ఒకప్పుడు నవ్వులతో కళకళలాడిన మా ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. కేతన్ ఇక ఎప్పటికీ తిరిగి రాడనే నిజం ప్రతిరోజూ నన్ను కలచివేస్తోంది. ఈ విషాదం మా కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. కేతన్ మరణించిన 20 రోజుల్లోనే మనవడి మరణాన్ని తట్టుకోలేక నా మామగారు ప్రాణాలు కోల్పోయారు. దయచేసి కేతన్‌ను మరో కేసు ఫైల్‌లా మార్చేయొద్దు. అతను ఒకరికి కుమారుడు, ఇంకొకరికి మనవడు, మరొకరికి సోదరుడు. కానీ నాకు మాత్రం అతడే నా ప్రపంచం. ప్రతిరోజూ రాత్రి అతడి ఫొటోతో మాట్లాడుతుంటాను. ఒకరోజు నీకు న్యాయం జరిగిందని కేతన్‌కు చెప్పే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా' అంటూ ప్రధాని మోదీకి రాఖీ అగర్వాల్ ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపారు.
కాగా, పుణెకు చెందిన 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగడ్ కోట సమీపంలోని లోయలో పడిపోయి మృతిచెందాడు. తొలుత పోలీసులు దీనిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. అయితే, దర్యాప్తులో ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యగా తేలింది. పెళ్లి ఇష్టం లేకపోవడంతో సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. లోహగడ్ కోటకు విహారయాత్ర పేరుతో తీసుకెళ్లి కేతన్‌ను కొండ పైనుంచి తోసి హత్య చేసినట్లు వెల్లడించారు. దీంతో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!