Share News

శిరోమణి అకాలీ దళ్ సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్‌కు మద్దతు ప్రకటిస్తూ..

ABN , Publish Date - Aug 08 , 2026 | 04:20 PM

పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసిన శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

శిరోమణి అకాలీ దళ్ సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్‌కు మద్దతు ప్రకటిస్తూ..
Sukhbir Singh Badal

ఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసిన శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే నిష్పక్షపాత, న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సమర్థించారు.


మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనను తక్షణమే చేపట్టాలని శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు పేర్కొన్నారు. తమ పార్టీ సిక్కుల బోధనల నుంచి స్ఫూర్తి పొందిందని.. మహిళల గౌరవం, సమానత్వం, సమాన హక్కుల కోసం సిక్కు గురువులు పోరాడారని చెప్పారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ సభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఇప్పటికే తమ పార్టీ అందరికీ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం డీలిమిటేషన్‌కు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మద్దతు ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కాగా, లోక్‌సభలో శిరోమణి అకాలీ దళ్ పార్టీకి ఒక స్థానం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు.. సానుకూలంగా ప్రభుత్వ రెండో దఫా చర్చలు

Updated Date - Aug 08 , 2026 | 04:34 PM