అసెంబ్లీలో విజయ్ హావభావాలపై భగ్గుమన్న స్టాలిన్!
ABN , Publish Date - Sep 10 , 2026 | 09:32 PM
అసెంబ్లీ ప్రసంగంలో సీఎం విజయ్ తన కుడిచేతితో గడ్టాన్ని పైకి లేపేట్టుగా చేసిన హావభావంపై ప్రతిపక్ష డీఎంకే మండిపడుతోంది. దీనిపై దుమారం రేగడంతో అది అనుకోకుండా వచ్చిన 'బాడీ లాంగ్వేజ్' అని విజయ్ వివరణ ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 10: అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో తమిళనాడు సీఎం విజయ్ తన కుడిచేతితో గడ్టాన్ని పైకి లేపేట్టుగా చేసిన హావభావంపై ప్రతిపక్ష డీఎంకే మండిపడుతోంది. దీనిపై దుమారం రేగడంతో, తాను కావాలని ఎవరినీ అవమానించడానికి అలా చేయలేదని, అది అనుకోకుండా వచ్చిన 'బాడీ లాంగ్వేజ్' అని విజయ్ వివరణ ఇచ్చారు.
వివాదం నేపథ్యం
తమిళనాడు సీఎం విజయ్ తాజాగా అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో తన కుడిచేతితో గడ్టాన్ని (jaw) పట్టుకుని పైకి లేపే హావభావాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పత్రాలు, సర్కారియా కమిషన్, ఎమర్జెన్సీ కాలం నాటి మీసా (MISA) చట్టాన్ని ప్రస్తావించారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది.
విజయ్ హావభావానికి స్టాలిన్ కౌంటర్
విజయ్ చూపించిన బాడీ లాంగ్వేజ్‌పై డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ స్పందిస్తూ దానికి చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో తనను మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు పోలీసులు తీవ్రంగా కొట్టారని స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. 'మీరు దవడను చూపిస్తూ పట్టుకున్నారు కదా.. అది నిజమే. జైల్లో లాఠీలతో కొట్టడం, బూటు కాళ్లతో తొక్కడం వల్ల నా దవడ ఎముకలు విరిగాయి. నాతో పాటు ఉన్న ఎంపీ చిట్టిబాబు జైట్లోనే చనిపోయారు' అని స్టాలిన్ వివరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని సైద్ధాంతిక శత్రువు అని చెప్పుకునే విజయ్‌కు ఈ చరిత్ర తెలియకపోవడం ఏంటని స్టాలిన్ ప్రశ్నించారు.
విజయ్ ప్రభుత్వానిది 'సినిమా షూటింగ్' పాలన అంటూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు. చట్టసభలను, పరిపాలనను ఒక సినిమా షూటింగ్‌లా, రీల్స్ చేసే వేదికలా మార్చేశారని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలు, మహిళల రక్షణ, రైతు రుణాలు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీల అమలు వంటి హామీలను విజయ్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు.
ఎన్నికల తర్వాత విజయ్ తనను కలసి 'ప్రచారంలో విమర్శించినందుకు క్షమించండి' అని అడిగినప్పుడు, ఇకపై ఒక ముఖ్యమంత్రి హోదాకు తగినట్లు మాట్లాడాలని సూచించానని, కానీ విజయ్ అది మరచిపోయారని స్టాలిన్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ