విమాన ప్రయాణికులకు భయంకరమైన అనుభవం!
ABN , Publish Date - Aug 12 , 2026 | 05:03 PM
ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు గంటల్లో ముగియాల్సిన ప్రయాణం.. తొమ్మిది గంటల సుదీర్ఘ నిరీక్షణగా మారి నరకాన్ని చూపించింది. ఊపిరాడక విమాన క్యాబిన్ 'గ్యాస్ ఛాంబర్'లా మారిందని ప్రయాణికులు వాపోయారు.
ఢిల్లీ, ఆగస్టు 12: ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన ఒక స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ కండిషనింగ్ (AC) వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు రెండు గంటల్లో ముగియాల్సిన విమాన ప్రయాణం, సాంకేతిక లోపం వల్ల ఏకంగా తొమ్మిది గంటల సుదీర్ఘ నిరీక్షణగా మారి నరకాన్ని చూపించింది. ఊపిరాడక విమాన క్యాబిన్ 'గ్యాస్ ఛాంబర్'లా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేమైంది?
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (టర్మినల్-1) నుంచి మంగళవారం రాత్రి 9:45 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం SG-105, రాత్రి 10:30 గంటల వరకు ఆలస్యమైంది. ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన తర్వాత ఏసీ పనిచేయకపోవడంతో విపరీతమైన వేడి, ఉక్కపోత మొదలైంది. విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉండగా, అందులో గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు.
ఫ్లైట్‌లో వాతావరణం వేడెక్కుతున్నా, ప్రయాణికులు చెమటతో తడిసిపోతున్నా పైలట్లు విమానాన్ని రన్‌వే వైపు తీసుకెళ్లడం ప్రారంభించారు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో క్యాబిన్ సిబ్బంది బ్లోయర్లు (Blowers) ఆన్ చేయగా, లోపల మరింత వేడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఒక గర్భిణి ఊపిరాడక సొమ్మసిల్లిపడిపోయే పరిస్థితి రావడంతో ప్రయాణికులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
రన్‌వేపైనే నిరసన
పరిస్థితి విషమించడంతో విమాన టేకాఫ్‌ను రద్దు చేసి ప్రయాణికులను కిందకు దించారు. అయితే ప్రయాణికులు రన్‌వేపైనే దాదాపు రెండు గంటల పాటు కూర్చొని స్పైస్‌జెట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి.. స్పైస్‌జెట్‌ను మూసివేయండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆలస్యమైనప్పటికీ వైద్య సహాయం అందించడంలో, మంచినీరు లేదా ఆహారం ఏర్పాటు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ప్రయాణికులు ఆరోపించారు. చివరకు సాంకేతిక బృందం వచ్చి పరిశీలించిన అనంతరం మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. ఆ విమానం బుధవారం ఉదయం 5:00 గంటలకు పుణేకు బయలుదేరింది.
స్పైస్‌జెట్ స్పందన
ఈ ఘటనపై స్పైస్‌జెట్ ప్రతినిధి స్పందిస్తూ... చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే విమానం ఆలస్యమైందని తెలిపారు. మరొక విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను పుణే చేర్చామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News