చీలిక దిశగా శరద్‌పవార్ ఎన్సీపీ!
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:45 PM
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా తాజాగా శరద్ పవార్ ఎన్‌సీపీ-ఎస్పీ సైతం ఆ దిశగానే వెళ్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ముంబై: మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా తాజాగా శరద్ పవార్ ఎన్‌సీపీ-ఎస్పీ సైతం ఆ దిశగానే వెళ్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు అజిత్ పవార్ నేషనలిస్ట్ పార్టీ (NCP) బాంబు పేల్చింది. దీంతో ప్రస్తుతం శివసేన ఎదుర్కొంటున్న పరిస్థితినే ఎన్‌సీపీ ఎస్పీ ఎదుర్కొనే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాతో సంప్రదింపులు నిజమే
శరద్ పవార్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎన్‌సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా ధర్మారావు ఆత్రం వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీలు ఎవరూ ఇంతవరకూ ధ్రువీకరించలేదు.
సంఖ్యాబలం
లోక్‌సభలో ఎన్‌సీపీ-ఎస్‌పీకి 8 మంది ఎంపీలు ఉండగా, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. పార్లమెంటరీ పార్టీలో చీలక జరగాలన్నా, అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలన్నా పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది ఎంపీలు జతకట్టవలసి ఉంటుంది. చట్టబద్ధంగా విడిపోవాలంటే లోక్‌సభలో ఆరుగురు ఎంపీలు ఒకేతాటిపైకి రావాల్సి ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఎన్‌సీ ఎస్‌పీ ఎంపీలుగా సుప్రియా సూలే, అమోల్ కొల్హే, భజ్‌రంగ్ సోనావనే, నీలేశ్ లంకే, సురేష్ మెహత్రే, అమర్ కలే, భాస్కర్ భాగరె, ధైర్యషీల్ మొహితే పాటిల్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి
సీఎం విజయ్‌కు ఊరట.. బలపరీక్షపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు