యూపీఏ ప్రభుత్వంలో జోక్యం చేసుకోలేదు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:38 AM
యూపీఏ ప్రభుత్వ హయాంలో అధికారాల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని సోనియా గాంధీ వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించగా, తాను కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించానని ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవితానికి సంబంధించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అనేక కీలక విషయాలను సోనియా గాంధీ వెల్లడించారు. ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ, కుటుంబం, రాజకీయ ప్రయాణం, భారతదేశంతో అనుబంధం వంటి అనేక అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా అలాంటి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో అధికారాల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని సోనియా గాంధీ వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించగా, తాను కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించానని ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకున్నానని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఫైళ్లను తెప్పించుకున్నానని గతంలో వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తాను కొన్ని సూచనలు ఇచ్చినట్లు అంగీకరించారు. అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు తగిన గుర్తింపు కల్పించాలన్నదే తన ఉద్దేశమని సోనియా వివరించారు.
మరోవైపు, 2004 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. ఈ నిర్ణయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కీలక పాత్ర పోషించారని, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవిని స్వీకరించవద్దని వారు సూచించారని తెలిపారు. 1991 ఆర్థిక సంస్కరణలకు నాయకత్వం వహించిన మన్మోహన్ సింగ్ అనుభవం యూపీఏ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని భావించి ఆయనను ప్రధానిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, 2010లో ప్రధానమంత్రి మార్పు అంశాన్ని ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించారని, ఆయనకు ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష ఉందని తాను అర్థం చేసుకున్నానని సోనియా తన పుస్తకంలో వెల్లడించారు. కాగా, యూపీఏ పదేళ్ల పాలనలో తన పాత్రపై వచ్చిన విమర్శలకు ఈ పుస్తకం ద్వారా సోనియా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
హోసూరు టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లో విషవాయువు లీక్.. ముగ్గురు కార్మికుల మృతి
బంగారం దోపిడీ కేసు.. ఎన్కౌంటర్లో ఇర్ఫాన్, దీపక్ అరెస్ట్