మోదీ సర్కారు కాళ్ల కింద నేల కదిలింది
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:03 AM
తమకు ప్రజాదరణ తగ్గలేదని మోదీ సర్కారు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం కాళ్ల కింద నేల ఇప్పటికే కదిలిందని, ఈ పాలన శాశ్వతం కాదని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.
ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు
న్యాయం కోసం నవతరం తపిస్తోంది
యువత మన దేశ ఆత్మను తిరిగి సాధిస్తారు
తన ఆత్మకథలో సోనియా
పప్పు, అన్నం లేనిదే రోజు గడవదని ‘ఎక్స్’లో పోస్ట్
న్యూఢిల్లీ, నవంబరు 11: తమకు ప్రజాదరణ తగ్గలేదని మోదీ సర్కారు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం కాళ్ల కింద నేల ఇప్పటికే కదిలిందని, ఈ పాలన శాశ్వతం కాదని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ఇటీవలికాలంలో మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలు.. ప్రభుత్వ అభద్రతాభావాన్ని సూచిస్తున్నాయని ఆమె తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’లో పేర్కొన్నారు. న్యాయం కోసం, అణచివేత వ్యవస్థలను తొలగించడం కోసం, అన్యాయాన్ని తొలగించడం కోసం నవతరం పరితపిస్తున్నట్లు తాను గ్రహించానని తెలిపారు. ‘‘అందుకు సమయం పట్టొచ్చు. కానీ.. కాలం మారుతుంది. యువత తాము అనుకున్నది సాధించడంలో విజయవంతమవుతుంది. వారు మన దేశ ఆత్మను తిరిగి సాధిస్తారు. దాని గాయాలను మాన్పుతారు’’ అని పేర్కొన్నారు. అలాగే.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కోరలు సాచిన అవినీతి వంటి విషయాలపై స్పందించేందుకు ప్రజలు గతంతో పోలిస్తే చాలా తక్కువగా భయపడుతున్నారని సోనియా అభిప్రాయపడ్డారు.
నిరంకుశ ప్రభుత్వాలు ప్రజా ప్రతిఘటనలను మరింత బలంగా అణచివేసేందుకు ప్రయత్నిస్తాయని.. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్నది అదేనని ఆమె పేర్కొన్నారు. ‘‘కానీ ఈ పాలన శాశ్వతం కాదు. అధికార దుర్వినియోగం తప్పనిసరి పర్యవసానాలకు దారి తీసి పతనానికి కారణమవుతుంది. ప్రపంచమంతా వ్యాపించిన అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం ఒక సుదూర అవశేషంగా మిగులుతుందని ఒక శతాబ్దం క్రితం ఎవరూ ఊహించి ఉండరు. కేవలం ఒక కొల్లాయి గుడ్డ ధరించిన బక్కపల్చటి మనిషి కోట్లాది మంది భారతీయులను ఒక్కటిగా చేసి ఆ మహాశక్తిని ఓడిస్తారని కూడా ఎవరూ ఊహించి ఉండరు’’ అని సోనియా తన ఆత్మకథలో రాశారు
. భారతదేశ వైవిధ్యంపై, బహుళత్వంపై ఒక మతాన్ని, ఒక భాషను రుద్దాలనే ఆరెస్సెస్ దీర్ఘకాలిక ఆధిపత్య పథకాన్ని ప్రజలు గట్టిగా ప్రతిఘటిస్తారనడంలో తనకు ఎలాంటి సందేహమూ లేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే.. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏడో పుట్టినరోజు వేడుకలకు అతడి బెస్ట్ ఫ్రెండ్ సిద్ధార్థ్ ఒక్కడే వచ్చాడని. మిగతావారెవ్వరూ రాలేదని.. ఏడేళ్ల చిన్నారికి స్నేహితులతో ఉన్న బంధం రాజకీయాల వల్ల కలుషితం కావడం పట్ల తామెంతో బాధపడ్డామని సోనియా వాపోయారు. ఒకసారి రాహుల్, ప్రియాంక బడి నుంచి ఇంటికి వస్తూనే.. ‘అమ్మా.. నాన్నను, నాయనమ్మను దొంగలని.. వారు జైలుకు వెళ్తారని.. అంతా ఎందుకంటున్నారు? వారేమైనా తప్పు చేశారా?’ అని ప్రశ్నించారని.. అదంతా నిజం కాదని వారిని తాను సముదాయించానని తెలిపారు.
పప్పు లేకుండా ఒక్కరోజు కూడా గడవదు
ఒకప్పుడు మంచి ఆహారం కోసం వెతికే క్రమంలోనే తాను రాజీవ్‌ను కలిసి, ప్రేమలో పడ్డానని పేర్కొన్న సోనియా.. ఇప్పుడు పప్పు, అన్నం తన ఇంటి రుచిగా మారిపోయిందని.. అది లేకుండా తనకు ఒక్కరోజు కూడా గడవదని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె కుమార్తె మిరాయాతో కలిసి దీపావళికి ముందు తీసుకున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు.