మోదీ.. కళ్లలోకి చూసిమాట్లాడరు
ABN , Publish Date - Nov 11 , 2026 | 02:37 AM
దేశం కోసం ప్రధాని మోదీ తనదైన దృక్కోణంలో పోరాడుతుంటే.. తాను తనదైన దృక్కోణంలో పోరాడుతున్నానని.. అంతే తప్ప ఇందులో వ్యక్తిగతమేమీ లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరిట రాసిన తన ఆత్మకథలో పేర్కొన్నారు.
ఆయన తీరు.. నా దారి.. వేర్వేరు
దేశం కోసం ఆయన తనదైన దృక్కోణంలో
పోరాడుతున్నారు.. నా దృక్కోణం నాది
ప్రధాని కావడానికి నేను తొలుత ఒప్పుకోలేదు
పార్టీ నాయకుల ఒత్తిడితో చివరికి సరేనన్నాను
నా నిర్ణయంపై రాహుల్, ప్రియాంక వ్యతిరేకత
మన్మోహన్ చేతుల్లో దేశం సురక్షితమని నమ్మే
ఆయన పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించా
పీవీ రాజనీతిజ్ఞుడు.. ఆయనతో శత్రుత్వం లేదు
రెండుసార్లు క్యాన్సర్‌తో పోరాడాబయటపడగలనా? అని ఆందోళన చెందా
ఇందిర సమక్షంలోనే మేనక అసభ్య పదజాలం
ఆమె వల్లే రాజీవ్-సంజయ్ బంధానికి బీటలు
రాహుల్ కన్నా ముందు బాబు పుట్టి పోయాడు
హిందూ సంప్రదాయం ప్రకారం మృతదేహాన్నినదిలో వదిలేసేందుకు నేను ఇష్టపడలేదు
ఆత్మకథలో సోనియా సంచలన విషయాలు
న్యూఢిల్లీ, నవంబరు 10: దేశం కోసం ప్రధాని మోదీ తనదైన దృక్కోణంలో పోరాడుతుంటే.. తాను తనదైన దృక్కోణంలో పోరాడుతున్నానని.. అంతే తప్ప ఇందులో వ్యక్తిగతమేమీ లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరిట రాసిన తన ఆత్మకథలో పేర్కొన్నారు. భారతదేశం గురించి తాను తన కుటుంబసభ్యుల నుంచి, అనేక జాతులు, సంస్కృతులు, భాషలు, మతాలతో కూడిన దేశంపై వారికున్న విశ్వాసం నుంచి నేర్చుకున్నానని.. ఆ భారతదేశం అందరికీ స్వేచ్ఛ, సమానత్వం అనే సూత్రాలపై ఆధారపడి ఉందని, అది ఆధిపత్యానికి వ్యతిరేకమైన భారతదేశం, సమ్మిళతత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం నిలబడే భారతదేశమని ఆమె వివరించారు.
అదే సమయంలో నరేంద్రమోదీ ‘భారతదేశ భావన’ ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల నుంచి, ఆయన పెరిగిన వాతావరణం నుంచి, ఆయనకు ఎదురైన అనుభవాల నుంచి రూపుదిద్దుకున్నదని.. అది ఒక మతానికి, సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తుందని సోనియా పేర్కొన్నారు. ఆ భారతదేశంలో అధికార క్రమం, క్రమశిక్షణ, నియంత్రణ కేంద్రంగా ఉంటాయన్నారు. మోదీ రాజకీయ ప్రయాణం తన ప్రయాణానికి పూర్తిగా భిన్నమైన మార్గంలో సాగిందని.. అణగారిన నేపథ్యం నుంచి రాజకీయాల్లో ఈ స్థాయికి చేరడానికి మోదీ ఆరెస్సె్‌సలో అంతర్గతంగా తనదైన శైలిలో పనిచేశారని పేర్కొన్నారు. అలాగే.. మోదీ, తాను కలిసేది అధికారిక సమావేశాల్లోనేనని.. అప్పుడు కూడా ఒకరికొకరం ఎదురుపడ్డప్పుడు ఆయన తనతో పెద్దగా మాట్లాడరని సోనియా వివరించారు. ముఖాముఖి మాట్లాడేటప్పుడు కూడా మోదీ కళ్లల్లోకి చూడరని పేర్కొన్నారు. ‘‘నరేంద్ర మోదీ పన్నెండేళ్లుగా దేశ ప్రధానిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ, ఈ రోజుకూ ఆయనతో పెద్దగా సంభాషించిందే లేదు. పార్లమెంట్ సెషన్ ముగిసినప్పుడో, ప్రధాన పార్టీల నేతలు స్పీకర్ చాంబర్లో కలిసినప్పుడో మేం కలుస్తుంటాం. అలాంటి సమయాల్లో మేం ఒకరికొకరం ఎదురైనప్పుడు నమస్తే అని పరస్పరం పలకరించుకుంటాం అంతే. ఆ సమయంలో ఆయన వేరేవైపు చూస్తారు. కళ్లలోకి చూసి మాట్లాడరు. నేను ఒకసారి అనారోగ్యానికి చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి వచ్చినప్పుడు ‘బాగున్నారా’ అని పలకరించారు. దానికి నేను ‘ఇప్పుడు బాగానే ఉన్నా. కృతజ్ఞతలు’ అని బదులిచ్చాను’’ అని సోనియా వివరించారు. మోదీ హయాంలో దేశం ఉదార ప్రజాస్వామ్యాల జాబితాలో భారత్ దిగువకు పడిపోయిందని, దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను బీజేపీ క్రమంగా కూల్చేసిందని ఆరోపించారు.

ప్రణబ్ ముఖర్జీ సంకేతాలు..
ప్రధాని కావాలన్న కోరికను ప్రణబ్ ముఖర్జీ ఒకసారి తనతో సూచనప్రాయంగా చెప్పిన సంఘటన గురించి కూడా సోనియా తన పుస్తకంలో ప్రస్తావించారు. ‘‘ప్రణబ్జీకి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంతో తీవ్ర విభేదాలు ఉండేవి. ఈ క్రమంలోనే 2010లో ఒకసారి ఆయన నా వద్ద తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ నాయకత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైందేమో అంటూ నన్ను దిగ్ర్భాంతికి గురిచేశారు. అది ప్రధాని కావాలన్న ఆయన చిరకాల కోరికకు సూచనగా నేను భావించాను’’ అని పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో తాను సున్నితంగా సంభాషణను వేరేవైపు మళ్లించానని.. దానికి ఆయన నిరాశ చెంది ఉండొచ్చుగానీ, ఆ విషయాన్ని ఆయన మనసులో పెట్టుకున్నట్లు తనకు ఎప్పుడూ అనిపించలేదని వెల్లడించారు. ఇక.. పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడని ప్రశంసించిన సోనియా.. ఆయనకు తనకు మధ్య శత్రుత్వమేమీ లేదని స్పష్టం చేశారు. తమ మధ్య శత్రుత్వం ఉందని చిత్రీకరించేందుకు కొందరు రాజకీయ నాయకులు, మీడియా వ్యక్తులు ప్రయత్నించారని ఆరోపించారు. రాజీవ్ హత్యపై దర్యాప్తు మందకొడిగా సాగడంపై మాత్రమే తాను బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశానని ఆమె గుర్తుచేశారు. అలాగే.. ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో అసువులు బాసిన రాజీవ్‌గాంధీ పార్థివదేహం ఫొటోను తాను ఇప్పటికీ చూడలేదని.. ఆ దృశ్యాలు తనకు కనపడకుండా రాహుల్, ప్రియాంక జాగ్రత్తలు తీసుకున్నారని సోనియా వెల్లడించారు.
నేను ఒప్పుకోలేదు..
2004లో ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టాలని తాను అనుకోలేదని.. తన పిల్లలు ఆ విషయం గురించి అడిగినప్పుడు అదే మాట చెప్పానని సోనియా వెల్లడించారు. ‘‘ఎన్నికలకు కొన్ని నెలల ముందు నేను, నా పిల్లలు దీనిపై చర్చించుకున్నాం. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే నేను ఆ పదవిని స్వీకరిస్తానా అని వారిలో ఒకరు నేరుగా అడిగారు. అస్సలు స్వీకరించనని నేను చెప్పాను. ‘మీరు కచ్చితంగా చెబుతున్నారా?’ అని వారు మళ్లీ అడిగితే.. ‘నాకు పూర్తి స్పష్టత ఉంది’ అని గట్టిగా చెప్పాను.’’ అని ఆమె వివరించారు. తాను ప్రధాని కావాలని రాహుల్, ప్రియాంక ఇద్దరూ కోరుకోలేదని.. అప్పటికింకా వారు తమ నాయనమ్మ (ఇందిరాగాంధీ), తండ్రి హత్యల తాలూకూ గాయాల నుంచి కోలుకోలేదని చెప్పారు. కానీ, తర్వాత పార్టీ నేతలు తనపై చాలా ఒత్తిడి తెచ్చారని, ఆ ఒత్తిడితో సరే అన్నప్పటికీ.. రాహుల్, ప్రియాంకలు భయపడంతో ప్రధాని పదవిని వద్దనుకున్నానని పేర్కొన్నారు.
ఆ స్పష్టత ఉంది..
యూపీఏ హయాంలో పాలనను తాను వెనక నుంచి నడిపానంటూ (బ్యాక్‌సీట్ డ్రైవర్) ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేశాయని సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు. దేశం ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుందని తనకు తెలుసు కాబట్టే.. ప్రధాని పదవికి ఆయన పేరు ప్రతిపాదించినట్టు తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగేనన్న స్పష్టత తనకు ఎప్పుడూ ఉందని.. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆయనకు తన అభిపాయ్రాలను చెప్పేదాన్నని, సలహాలు, సూచనలు ఇచ్చేదాన్నని, కొన్నిసార్లు ఆయనతో విభేదించేదాన్నని స్పష్టం చేశారు. ‘‘మన్మోహన్ సారథ్యంలో ప్రభుత్వం, నా నేతృత్వంలో పార్టీ.. అనే అలిఖిత అధికారాల విభజన ఎప్పుడూ ఉండేది’’ అని వివరించారు.
విషాదకరం.. సిగ్గుచేటు..
1984లో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాతి భయానక దృశ్యాలను చూసి నాటి ప్రధాని ఇందిరాగాంధీ కన్నీరుమున్నీరయ్యారని సోనియా వెల్లడించారు. స్వర్ణదేవాలయంలో సైనిక చర్య ముగిసిన తీరు చూసి ఇందిర కళ్లల్లో దుఃఖమే కాక.. తీవ్ర వేదన, పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించాయని ఆమె తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలాగే.. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినసిక్కు వ్యతిరేక అల్లర్లను దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరం, సిగ్గుచేటైన అధ్యాయంగా సోనియా అభివర్ణించారు. తన తల్లి హత్యకు సంబంధించి రాజీవ్‌గాంధీ మనసులో ఎవరిపైనా ద్వేషం లేదని ఆమె స్పష్టం చేశారు. అప్పట్లో సిక్కులపై జరిగిన దాడులను ఆయన సమర్థించలేదని.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శాంతి కోసం జాతినుద్దేశించి ప్రసంగించారని, ‘రక్తం చిందించొద్దు.. ద్వేషాన్ని వీడండి’ అన్న ఇందిరాగాంధీ మాటలను గుర్తుచేశారని వెల్లడించారు. ఇక ఎమర్జెన్సీ విషయానికి వస్తే.. ఎలాంటి రాజ్యాంగబద్ధ అధికార హోదాలో లేనప్పటికీ ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకపాత్ర సంజయ్గాంధీదేనని సోనియా పేర్కొన్నారు. ఆయన్ను ‘ఆత్రుత పడే వ్యక్తి’గా ఆమె అభివర్ణించారు. నాటి అల్లకల్లోల పరిస్థితుల వల్ల గత్యంతరం లేక అత్యయిక స్థితిని విధించినప్పటికీ.. ప్రధాని ఇందిరాగాంధీ ఎప్పుడూ లోలోపల ప్రశాంతంగా లేరని, దానివల్ల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారన్న విషయాన్ని ఆమె గ్రహించారని వెల్లడించారు. సంజయ్‌గాంధీ దూకుడు వైఖరి ఇందిరను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టేసినట్టు తెలిపారు. అలాగే.. గోధ్రా రైలు దహనం అనంతరం జరిగిన గుజరాత్ అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు అఖిలపక్ష బృందంతో కలిసి వెళ్లినప్పుడు హృదయాన్ని కలచివేసే దృశ్యాలను చూసినట్టు సోనియా తన ఆత్మకథలో రాశారు. ఒక తండ్రి తన కుమార్తెను చేతుల్లో ఎత్తుకుని తమ వద్దకు వచ్చి విలపించాడని.. ‘‘నా కుమార్తెపై ఆ రాక్షసులు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారు.. మీరే మాకు సాయం చేయాలి’ అంటూ దీనంగా వేడుకున్నాడని పేర్కొన్నారు.
ఇందిర కోపం చూసివణికిపోయేదాణ్ని
ఇందిరకు కోపం వస్తే.. నేను వణికిపోయేదాణ్ని. ఆమె కోపతాపాలు సిబ్బందిని నిశ్చేష్ఠులను చేసేవి. పార్లమెంట్లో అధికార-విపక్షసభ్యుల మధ్య వాగ్వాదాలు జరిగిన సందర్భాల్లో, భోజన సమయంలో ఇందిర చాలా కోపంగా కనిపించేవారు. ఓసారి డైనింగ్ టేబుల్ వద్ద తీవ్ర ఆవేశంలో ఆమె, ప్లేటును విసిరికొట్టారు. మరోసారి అపాయింట్మెంట్ గురించి తనకు గుర్తుచేయడాన్ని ఒకరు మరిచిపోతే.. ఆమె ఆవేశంలో గదిలో అటూ ఇటూ తిరుగుతే ఆ వ్యక్తి రూంలో ఓ మూలన స్థాణువులా నిల్చుండిపోయాడు. ఆమె కోపాన్ని చూసి తొలినాళ్లలో నేను కంగారుపడటాన్ని చూసి రాజీవ్.. ‘‘భయపడకు. అమ్మ కోపం చప్పున చల్లారుతుందిలే’’ అని చెప్పారు.
రెండుసార్లు క్యాన్సర్‌తో పోరాడా
అప్పుడప్పుడూ ఆస్తమాతో పాటు ఎలర్జీ, కడుపునొప్పి వంటి సమస్యలు తప్ప నాకు తీవ్రమైన అనారోగ్య సమస్యలేమీ ఉండేవి కావు. కానీ రెండుసార్లు నేను క్యాన్సర్‌తో పోరాడాను. 2010లో రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్లు తెలియగానే తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురయ్యాను. రాహుల్, ప్రియాంక సూచనతో సర్ గంగారామ్ ఆస్పత్రిలో అదే ఏడాది శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఏడాదయ్యాక.. క్లోమ క్యాన్సర్ ఉన్నట్లు తేలడం నన్ను, పిల్లలను దిగ్భ్రమపరిచింది. ఈసారి అందరూ ధైర్యం చెప్పినప్పటికీ.. ఇది మెటస్టాటిక్ క్యాన్సర్ (విస్తరించే క్యాన్సర్) కాదు కదా? ‘‘నేను దీన్నుంచి బయటపడగలనా’’ అనే ఆందోళన నన్ను వేధించింది. రెండోసారి శస్త్త్రచికిత్సకు సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, అతికొద్ది మంది ప్రభుత్వ పెద్దలకే తెలుసు.
రాజీవ్ నావైపు చేయి చాచాడు
2016లో ఐదుగంటలకుపైగా సాగిన యూపీ వారాణసీ ఎన్నికల ర్యాలీలో నేను స్పృహ తప్పి పడిపోయాను. నన్ను వెంటనే విమానంలో ఢిల్లీకి తరలించారు. నెమ్మదిగా కళ్లు తెరుస్తూనే మళ్లీ స్పృహ కోల్పోతున్నాను. ఆ సమయంలో రాజీవ్.. నావైపు చేయిచాచి, అంతా బాగుంటుంది అంటూ భరోసా ఇస్తూ నవ్వుతున్నట్లు నాకు అనిపించింది. నాటి ర్యాలీలో అలసట కారణంగా కింద పడటంతో నా భుజం విరిగింది. శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
ప్రణబ్ ముఖర్జీ ప్రధానికావాలనుకోవడం తప్పా?
ప్రశ్నించిన ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలని కోరుకోవడంలో తప్పేముందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ ప్రశ్నించారు. 2010లో యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ.. ‘‘పై స్థాయిలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందేమో’’అని సూచించారని.. ప్రధాని పదవిపై ఆయనకున్న ఆకాంక్ష తనను ఆశ్చర్యానికి గురి చేసిందని సోనియా పేర్కొన్నారు. దీనిపై శర్మిష్ఠ ముఖర్జీ స్పందించారు. ‘‘దీనికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? దశాబ్దాల రాజకీయ, పాలనా అనుభవానికి తోడు, కష్టపడి పని చేసే తీరు, గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తి ప్రధాని కావాలని కోరుకోవడం నేరం అవుతుందా?’’అని ఆమె ప్రశ్నించారు. గాంధీ-నెహ్రూ కుటుంబం వెలుపలి వ్యక్తి ప్రధాని కావాలన్న ఆశయం కలిగి ఉండడాన్ని సోనియా ఆశ్చర్యంగా భావించారా? అని నిలదీశారు.
పుస్తకానికి ‘వైట్ వాషింగ్’అని పేరు పెట్టాల్సింది: బీజేపీ
సోనియాగాంధీ తన ఆత్మకథలో.. 1975లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని సమర్థించుకోవడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార పత్రినిధి సీఆర్ కేశవన్ స్పందిస్తూ.. నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పులను కప్పిపుచ్చి, కాంగ్రెస్ పాపాలకు షుగర్ కోటింగ్ చేసే ప్రయత్నంలో భాగంగానే సోనియా ఈ పుస్తకం తెచ్చారని ఆరోపించారు. ఈ పుస్తకానికి బిలాంగింగ్ బదులు.. ‘వైట్ వాషింగ్’అని పేరు పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై సోనియాగాంధీ కన్నీరు పెట్టుకున్నారని చెబుతున్నారని.. మరి 1984లో సిక్కులపై జరిగిన అల్లర్లలో వేలాది మంది అమాయకులు మరణించినప్పుడు ఆమె స్పందించారా? అని ప్రశ్నించారు. దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నిరాకరించానంటూ సోనియా తన పుస్తకంలో పేర్కొనడంపై బీజేపీ నేత దినేశ్ ప్రతాప్ సింగ్ స్పందిస్తూ.. 2004లో సోనియాగాంధీ ప్రధాని కావాలని కోరుకున్నారని.. కానీ ఇటాలియన్ మూలాలున్న మహిళ కావడంతో ఆ పదవికి సోనియాను అనర్హురాలిగా భావించి, అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ అడ్డుకున్నారని చెప్పారు.
విక్రయానికి సోనియా ఆత్మకథ
ఎంఆర్పీ రూ.1,299..
బ్లింకిట్‌లో రూ.849కే
సోనియాగాంధీ తాజాగా విడుదల చేసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకందేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పుస్తక దుకాణాలు, రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. రూ.1,299 ధర కలిగిన ఈ పుస్తకాన్ని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ సుమారు 35ు తగ్గింపుతో రూ.849కే అందిస్తోంది. సెంట్రల్ ఢిల్లీలో ఆర్డర్ చేసిన ఎనిమిది నిమిషాల్లో పుస్తకం డెలివరీ చేస్తామని ప్రకటించింది. అయితే దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్టాక్ లేదని చూపిస్తోంది. అమెజాన్‌లోనూ ఈ పుస్తకం విక్రయానికి రాగా, డెలివరీకి 48 గంటల సమయం చూపిస్తోంది. 544 పేజీలతో ఉన్న ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ ఇండియా ముద్రించింది.
నా నుదుటన ఇందిర ముద్దు
1968లో సెప్టెంబరులో నేను గర్భం దాల్చాను. ఇది తెలిసి.. ఇందిరా గాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయన్నారు. నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని, నుదుటన ముద్దు పెట్టుకున్నారు. నెలలు పూర్తిగా నిండకముందే 1969 జనవరి 18న బాబు పుట్టాడు. ఒత్తయిన నల్లటి జట్టు.. పొడవాటి సన్నని వేళ్లతో ముద్దులొలికే ఆ బిడ్డను చూసుకుని నేను, రాజీవ్ ఎంతో మురిసిపోయాం. అయితే ఆ మరుసటి రోజే బాబు చనిపోయాడు. రాజీవ్, నేనూ వెక్కివెక్కి ఏడ్చాం. హిందూ సంప్రదాయం ప్రకారం మృత శిశువును ఖననం చేయకుండా నదిలో వదిలిపెట్టాల్సి ఉంటుంది. అయితే గతంలో ఓక్లా బ్యారేజీ వద్ద నీళ్లలో బాగా ఉబ్బిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉండటం, దాన్ని కుక్కలు పీక్కుతింటుండటం నాకు గుర్తొచ్చింది. అందుకే వెంటనే నేను బిడ్డ మృతదేహాన్ని నదిలో పారేయొద్దని చెప్పాను. తర్వాత మెహ్రౌలీలోని ఫిరోజ్ గాంధీ ఫాంహౌస్ లో రాజీవ్, మరిది సంజయ్ ఆ బిడ్డ మృతదేహాన్ని ఖననం చేశారు. కొడుకును కోల్పోయానన్న బాధలో ఉన్న నేను, అప్పట్లో రైట్-వింగ్ న్యూస్‌పేపర్ ‘‘ఓ అక్రమ సంతానానికి నాన్నమ్మ అయ్యే అవకాశాన్ని ఇందిర కోల్పోయారు’’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త చూసి మరింత కలతచెందాను’
మేనక పరుష పదజాలం
సంజయ్ ప్రేమించి.. పెళ్లాడిన మేనక నూతన వధువుగా ఇంట్లోకి అడుగుపెట్టిన రోజుల్లో ఎంతో ఉత్సాహంగా, కలివిడిగా ఉండేవారు. ‘బహూరాణి’ అంటూ సిబ్బంది నన్ను పిలిచినా నేను, మేనక ఆ ఇంటికి రెండు కళ్లలాంటి కూతుళ్లు అనే భావించేదాన్ని. అయితే నెమ్మదిగా ఇంట్లో చికాకులు మొదలవడంతో వాతావరణం మారడం మొదలైంది. మేనక పరుషంగా మాట్లాడినప్పుడు చాలాసార్లు నేను మౌనంగా ఉండేదాన్ని. అయితే ఆమె పరిధులు దాటారని అనిపించినప్పుడు నేను తీవ్రస్థాయిలో బదులిచ్చేదాన్ని. పెళ్లయిన కొద్దికాలానికే సంజయ్-మేనక మధ్య విభేదాలు పొడచూపాయి. మేనక చికాకు పడ్డప్పుడు అత్తగారి (ఇందిర) సమక్షంలోనే అసభ్యపదజాలం వాడేవారు. ఆమె తీరు మమ్మల్ని దిగ్ర్భాంతికి గురిచేసేది. విమాన ప్రమాదంలో సంజయ్ చనిపోయాక పరిస్థితులు మరింత దిగజారాయి. ఆ సమయంలోనే మేనక గాంధీ తల్లి.. తన కూతురుకు రాజకీయ పదవి కట్టబెట్టేలా డిమాండ్ చేయాలంటూ పార్టీలో సంజయ్ విధేయులను ప్రోత్సహించారు. అయితే అప్పటికి మేనక వయసు 23 ఏళ్లేనని, ఆ పరిపక్వత లేని వయసులో ఆమెను రాజకీయాల్లోకి తేవడం సరికాదని ఇందిర భావించారు.
ఇవి కూడా చదవండి..
వాయుకాలుష్యం.. ఉత్తరాదిన గగనతలంలో దట్టమైన పొగ
ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ