18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:56 PM
18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను స్వతంత్రంగా తెరవడం, ఉపయోగించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను స్వతంత్రంగా తెరవడం, ఉపయోగించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్లకు చట్టపరంగా ఒప్పందాలు చేసుకునే సామర్థ్యం లేనప్పుడు, సోషల్ మీడియా ఖాతా తెరిచే సమయంలో ప్లాట్‌ఫామ్ నిబంధనలను అంగీకరించడం ఎలా సాధ్యమవుతుందనే అంశాన్ని కోర్టు ప్రస్తావించింది. ఈ విషయంలో 18 ఏళ్ల వయోపరిమితిని అమలు చేసేలా చట్టబద్ధమైన నిబంధనలు రూపొందించవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది (Supreme Court social media age limit).
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే సంబంధిత ప్లాట్‌ఫామ్ నిబంధనలు, షరతులను అంగీకరించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. భారత ఒప్పందాల చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం మైనర్లకు ఒప్పందం చేసుకునే సామర్థ్యం ఉండదని కోర్టు పేర్కొంది. మైనర్‌తో చేసుకున్న ఒప్పందం ప్రారంభం నుంచే చెల్లుబాటు కాదనే న్యాయపరమైన అంశాన్ని కూడా విచారణలో ప్రస్తావించింది (Minors social media India).
మైనర్లు స్వతంత్రంగా సోషల్ మీడియా ఖాతాలను తెరవకుండా నిరోధించేందుకు చట్టబద్ధమైన నిబంధనలు తీసుకురావచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది (Child safety social media). 18 ఏళ్లలోపు పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడంపై పూర్తిగా నిషేధం విధించాలా లేదా నిర్దిష్ట వయసు వరకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి, పర్యవేక్షణ ఉండేలా నిబంధనలు తీసుకురావాలా అనే అంశం కూడా చర్చకు వచ్చింది.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..
పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..