స్కైరూట్ వ్యవస్థాపకుల సక్సెస్ స్టోరీ.. ఇస్రో నుంచి విక్రమ్-1 విజయవంతం వరకు..
ABN , Publish Date - Jul 18 , 2026 | 09:01 PM
ఒకరు హైదరాబాద్‌కు చెందిన యువ శాస్త్రవేత్త.. మరొకరు ఐఐటీ మద్రాస్‌లో చదివిన ప్రతిభావంతుడు. ఇద్దరూ ఇస్రోలో శాస్త్రవేత్తలుగా స్థిరమైన ఉద్యోగాలు చేశారు. కానీ, ఉద్యోగ భద్రత కంటే కొత్త కలలకు ప్రాధాన్యం ఇచ్చారు. రూమ్‌మేట్స్‌గా మొదలైన వారి స్నేహం.. నేడు భారత అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన విజయగాథగా నిలిచింది. వారే స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా.
ఇంటర్నెట్ డెస్క్: ఒకరు హైదరాబాద్‌కు చెందిన యువ శాస్త్రవేత్త.. మరొకరు ఐఐటీ మద్రాస్‌లో చదివిన ప్రతిభావంతుడు. ఇద్దరూ ఇస్రోలో శాస్త్రవేత్తలుగా స్థిరమైన ఉద్యోగాలు చేశారు. కానీ, ఉద్యోగ భద్రత కంటే కొత్త కలలకు ప్రాధాన్యం ఇచ్చారు. రూమ్‌మేట్స్‌గా మొదలైన వారి స్నేహం.. నేడు భారత అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన విజయగాథగా నిలిచింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన స్కైరూట్ ఏరోస్పేస్ ద్వారా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ను విజయవంతంగా ప్రయోగించి దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వారే ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా. వారు స్థాపించిన స్కైరూట్ చిన్న స్టార్టప్‌గా ప్రారంభమై అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయల విలువైన యూనికార్న్ కంపెనీగా ఎదిగింది. తాజాగా విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంతో ప్రపంచ వాణిజ్య అంతరిక్ష రంగంలోనూ తన సత్తా చాటుకుంది.
స్టార్టప్ ఆలోచన..
స్కైరూట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్ కుమార్ చందన తెలంగాణలోనే జన్మించారు. హైదరాబాద్‌లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం 2007లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ (మెకానికల్ ఇంజినీరింగ్)లో చేరారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా ఇస్రోలో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత త్రివేండ్రంలోని ఇస్రో క్యాంపస్‌లో జాయిన్ అయ్యారు. అయితే, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన మాత్రం ఆయనను ఎప్పుడూ వెంటాడుతుండేది. ఐఐటీలో చేరిన తర్వాత ఆ ఆలోచన మరింత బలపడిందని గతంలో ఓసారి ఆయన వెల్లడించారు. ఇస్రోలో తనతో సమాన ఆలోచనలున్న నాగ భరత్ డాకా.. రూమ్‌మేట్‌గా, సహ శాస్త్రవేత్తగా చేరడంతో వ్యాపారవేత్తగా మారాలనే తన కలకు రూపురేఖలు దొరికాయని పవన్ పేర్కొన్నారు.
ఉద్యోగం నుంచి స్టార్టప్ వైపు..
త్రివేండ్రంలోని ఇస్రో క్యాంపస్‌లో ఉద్యోగ జీవితం ఎంతో సౌకర్యవంతంగా ఉండేదని, మంచి జీతం, స్థిరమైన భవిష్యత్తుతో అక్కడే పదవీ విరమణ చేయవచ్చనే భావన తొలినాళ్లలో ఉండేదని పవన్ తెలిపారు. అయితే, వ్యాపారవేత్త కావాలనే అంతర్లీన కోరిక క్రమంగా బలపడిందని చెప్పారు. 'నాకు తెలిసిన అంతరిక్ష శాస్త్రాన్నే వ్యాపార అవకాశంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాను' అని పవన్ పేర్కొన్నారు. మరోవైపు స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ నాగ భరత్ డాకా.. ఐఐటీ మద్రాస్‌లో ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. ఇద్దరూ కొన్నేళ్లపాటు ఇస్రోలో వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
చిన్న ఉపగ్రహాల్లోనే అవకాశం గుర్తింపు..
ఇస్రో ప్రధానంగా భారీ ఉపగ్రహాల ప్రయోగాలకు అవసరమైన రాకెట్ల అభివృద్ధిపైనే దృష్టి సారిస్తుందని, చిన్న, మధ్యస్థాయి ఉపగ్రహాల కోసం ప్రత్యేక రాకెట్ల తయారీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పవన్, భరత్ గుర్తించారు. అదే తమ వ్యాపార ఆలోచనకు పునాదిగా మార్చుకున్నారు. ఈ ఆలోచనతో ప్రముఖ వ్యాపారవేత్త, మింత్రా వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సల్‌ను కలిసి తమ ప్రణాళికను వివరించారు. ఆయన వెంటనే ప్రారంభ పెట్టుబడి సమకూర్చడంతో ఇస్రో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇద్దరూ కలిసి స్కైరూట్ ఏరోస్పేస్‌ను స్థాపించారు. అంకుర సంస్థగా ప్రారంభమైన స్కైరూట్ నేడు యూనికార్న్ స్థాయికి చేరుకోవడమే కాకుండా, స్వదేశీ ఆర్బిటల్-క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి
అనుమానిత ఉగ్రవాదుల కేసులో ఏటీఎస్ సంచలన విషయాలు వెల్లడి..
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి..