విజయ.. విక్రమ్
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:09 AM
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటిసారి ఓ ప్రైవేటు ఏరోస్పేస్ సంస్థకు చెందిన ఆర్బిటాల్ రాకెట్ రోదసిలోకి విజయవంతంగా...
నింగిలోకి దూసుకుపోయిన తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1
చరిత్ర సృష్టించిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్ట్‌ప స్కైరూట్ ఏరోస్పేస్
షార్ నుంచి ప్రయోగం సక్సెస్
నిర్దేశిత సమయం కంటే 35
నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం
ఆరు ఉపగ్రహాలతో రోదసిలోకి!
భారత అంతరిక్ష రంగంలో కీలక
మైలురాయిగా ‘మిషన్ ఆగమన్’
స్టార్ట్‌పలకు మరిన్ని అవకాశాలు
కొత్త ఆవిష్కరణలకు ఊతం: మోదీ
‘స్కైరూట్’ బృందానికి అభినందనలు
‘భారత్-2047’ విజన్‌కు దోహదం
చేసే విజయమిది: ఇస్రో చైర్మన్
రాకెట్ ప్రత్యేకతలు..
పొడవు : 23 మీటర్లు
వ్యాసం : 1.7 మీటర్లు
బరువు : 30 టన్నులు
నిర్మాణం : రాకెట్ బరువు చాలా తక్కువగా ఉండేలా కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో నిర్మాణం
త్రీడీ ప్రింటెడ్ ఇంజన్లు: ఖర్చు తగ్గించడానికి దీనిలో అత్యాధునిక త్రీడీ ప్రింటెడ్ ఇంజన్లను వాడారు.
సామర్థ్యం: 350 కేజీల బరువుండే పేలోడ్‌లను భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టగలదు.
సూళ్లూరుపేట, జూలై 18 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొట్టమొదటిసారి ఓ ప్రైవేటు ఏరోస్పేస్ సంస్థకు చెందిన ఆర్బిటాల్ రాకెట్ రోదసిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ‘మిషన్ ఆగమన్’ పేరిట చేపట్టిన ఈ ప్రయోగంలో హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల 30 సెకన్లకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విక్రమ్-1 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. ఒక ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి కావడం ఒక విశేషమైతే.. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు విస్తృతమైన అవకాశాలు కల్పించేదిశగా ఈ ప్రయోగం కీలక పాత్ర పోషించడం మరో విశేషం. కాగా, విక్రమ్-1 450 కిలో మీటర్ల ఎత్తుకు ప్రయాణించి 6 చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో భారత ప్రైవేటురంగంకూడా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగల సామర్థ్యాన్నిప్రపంచానికి చాటినట్టయింది.
35 నిమిషాలు ఆలస్యంగా..
విక్రమ్-1 రాకెట్.. నిర్దేశిత సమయం కంటే 35 నిమిషాల పాటు ఆలస్యంగా నింగిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. వాస్తవ షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-1 అం తరిక్షం దిశగా దూసుకుపోవాలి. అయితే, ప్రయోగ దశలో అంతరాయం ఏర్పడడంతో మిషన్ కంట్రోల్ బృందం తొలుత తాత్కాలికంగా ప్రయోగాన్ని వాయి దా వేసింది. అంతరాయాన్ని గుర్తించి, సరిచేసిన తర్వాత 12గంటల 5నిమిషాల 30సెకన్లకు విక్రమ్-1 ఆర్బిటాల్ రాకెట్ నింగిని చీల్చుకుంటూ స్పేస్‌లోకి సాగిసోయింది. 12.21 గంటలకు విక్రమ్-1 తీసుకువెళ్లిన పేలోడ్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోగానే.. ప్రయో గం విజయవంతం అయినట్టు ‘షార్’ ప్రకటించింది. ‘‘హలో స్పేస్.. మేం వచ్చేశాం!.’’ అంటూ షార్‌లోని కామెంటేటర్లు బిగ్గరగా వ్యాఖ్యానించారు. ఈ ప్రయో గం భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ఈ రాకెట్‌ను రూపొందించిన హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ సంస్థ ప్రపంచస్థాయి చిన్నతరహా ప్రైవేట్ ఏరోస్పేస్ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది.
విక్రమ్-1 తీసుకెళ్లింది వీటినే!
గ్రాహా స్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్డ్, స్కైరూట్ సొంతగా తయారుచేసిన స్కోప్‌పేలోడ్లను విక్రమ్-1 అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటితోపాటు కాస్మోస్ డైమండ్స్ ఆర్ట్ వర్క్ ‘కాస్మిక్ బ్లూమ్’, సర్ సీవీ రామ న్, డాక్టర్ విక్రమ్‌సారాభాయ్, ఏపీజే అబ్దుల్‌కలాంల సూక్ష్మ కళాఖండాలను సైతం ఈ రాకెట్ అంతరిక్షానికి చేర్చింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ ‘వందేమాతరం’ అని స్వయంగా చేతితో రాసిన పోస్టుకార్డుతోపాటు.. స్కైరూట్ ఏరోస్పేస్ సిబ్బంది, ఇస్రో ప్రస్తుత, మాజీ చైర్మన్లు, భారత వ్యోమగాములు, పెట్టుబడిదారులు, అంతరిక్ష పరిశోధకులు రాసిన సందేశాలనూ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపారు.
ప్రముఖుల పేర్లు
భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్‌కు ‘విక్రమ్’ పేరు పెట్టారు. అలాగే ఈ రాకెట్‌లో మొత్తం 4 దశలు ఉంటాయి. వాటిలో 1 నుంచి 3 దశలు ఘన ఇంధనంతో పనిచేస్తాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం వాటికి ‘కలాం ఇంజన్లు’ (కలాం-1200, కలాం-250, కలాం-100) అని పెట్టా రు. ఇవి రాకెట్ పైకి వెళ్లడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇక నాలుగో దశ ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. దిగ్గజ శాస్త్రవేత్త సీవీ రామన్ గౌరవార్థం దీనికి ‘రామన్ ఇంజిన్’ అనే పేరు పెట్టారు. ఇది ఉపగ్రహాలను కక్ష్యలో సరైన స్థానంలో చేర్చడానికి ఉపయోగపడుతుంది.
అంచలంచెలుగా ఎదిగిన
స్కైరూట్ సీఈవో పవన్‌కుమార్
‘విక్రమ్-1’ విజయవంతం ద్వారా స్కైరూట్ కంపెనీ సహ వ్యవస్థాపకులు, సీఈవో పవన్‌కుమార్ చందన భారత అంతరిక్ష ప్రస్థానానికి ఒక కొత్త దిశను చూపారు. అందరి దృష్టిని ఆకర్షించి, ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. అంచలంచెలుగా ఎదిగారు. ఒకప్పుడు గణితంలో 51 మార్కులు మాత్రమే వచ్చిన వ్యక్తి.. ఆ తర్వాత రెండు దశాబ్దాల క్రితం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించడం, అక్కడి నుంచి ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరడం, అనంతరం రాకెట్లు తయారీ చేసే కంపెనీ స్థాపించడం వరకూ రావడం గమనార్హం. ఒకప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టిన గణితం, సైన్స్ సబ్జెక్టులనే పవన్‌కుమార్ తన భవిష్యత్తుకు పునాదులుగా మలచుకున్నారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, ఇస్రోలో సహ ఇంజనీర్ అయిన నాగభరత్‌లో కలిసి పవన్‌కుమార్ 2018 జూన్‌లో హైదరాబాద్‌లో ‘స్కైరూట్ ఏరోస్పే్‌స’ను స్థాపించారు. అంతకుముందు ఇస్రోలో శాస్త్రవేత్తగా చేస్తున్న సమయంలో పవన్‌కుమార్ జీఎ్‌సఎల్‌వీ ఎంకే-3 మిషన్‌కు పనిచేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఆరేళ్లకు పైగా పనిచేసిన ఆయన.. రాకెట్ రూపకల్పన, అభివృద్ధిలో అనుభవం సంపాదించారు. ఆ తర్వాత భారత స్టార్టప్ రంగం విస్తరిస్తున్న క్రమంలో, ఆయన ఆ దిశగా ముందుకు సాగారు. నిధుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రోత్సాహకుల సాయంతో నిలబడి, విజయం సాధించారు. 2020 జూలైలో రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన తొలి భారత ప్రైవేటు కంపెనీగా ‘స్కైరూట్’ నిలిచింది. 2022 నవంబరు 18న భారత్‌లో తొలిసారి ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేసిన సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-ఎ్‌స’ను ప్రయోగించింది. ఇది ఈ కంపెనీతో పాటు భారత ప్రైవేటు అంతరిక్ష రంగానికి ఒక కీలక మలుపుగా నిలిచింది. ‘నా దృష్టిలో పారిశ్రామికవేత్తగా రాణించడం అనేది ఒక అత్యుత్తమ వృత్తిపరమైన ఎంపిక. ఎందుకంటే ఇది స్వేచ్ఛ, స్వతంత్రతను ఇస్తుంది. ఇది దేశాన్ని నిర్మించడానికి, ఉపాధి కల్పించడానికి ఒక అవకాశం’ అని పవన్‌కుమార్ అంటారు.
భారత అంతరిక్ష ప్రయాణంలో మైలురాయి
స్కైరూట్ బృందానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు శుభాకాంక్షలు చెప్పారు. ఇది దేశానికి గొప్ప విజయమని కొనియాడారు. భారత అంతరిక్ష చరిత్రలో ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని, ఆవిష్కరణలను వేగవంతం చేస్తుందని శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రయోగం విజయవంతమైన తర్వాత ప్రధాని మోదీ స్కైరూట్ బృందంతో ఫోన్‌కాల్ ద్వారా మాట్లాడారు. ఈ చరిత్రాత్మక ప్రయోగాన్ని తాను కూడా వీక్షించినట్లు వారికి చెప్పారు. ఈ మిషన్ విజయవంతానికి అహర్నిశలు కృషిచేసిన యువ ఇంజనీర్లను ఆయన ప్రశంసించారు. ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొంటూ.. ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆ బృందాన్ని కోరారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంభనను ఈ విజయవంతమైన మిషన్ ప్రపంచానికి చూపిందన్నారు. ఈ సందర్భంగా త్వరలో తనను కలిసేందుకు రావాలని ప్రధాని మోదీ స్కైరూట్ బృందాన్ని ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి
దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు