Share News

బంగారం దోపిడీ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇర్ఫాన్‌, దీపక్‌ అరెస్ట్

ABN , Publish Date - Nov 10 , 2026 | 10:52 AM

ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని సీతాపూర్‌ జిల్లాలో పోలీసులు, దుండగుల మధ్య భీకర ఎదురుకాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఓ బంగారు వ్యాపారిని దోచుకున్న కేసులో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి నిందితులను అరెస్టు చేశారు.

బంగారం దోపిడీ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇర్ఫాన్‌, దీపక్‌ అరెస్ట్
Sitapur Encounter

ఉత్తర్‌ప్రదేశ్‌: సీతాపూర్‌ జిల్లాలో పోలీసులు, దుండగుల మధ్య భీకర ఎదురుకాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఓ బంగారు వ్యాపారిని దోచుకున్న కేసులో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి నిందితులను అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు దుండగుల కోసం యూపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌ (SOG) సంయుక్త బృందం ఆపరేషన్‌ చేపట్టాయి. పక్కా సమాచారంతో ఈరోజు (మంగళవారం) ఉదయం నిందితులు ఉన్న ప్రాంతానికి వెళ్లగా.. వారు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులూ ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుల కాళ్లకు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు.


సీతాపూర్‌లోని సిధౌలి కోత్వాలి ప్రాంతంలో విమ్లేష్ రస్తోగి అనే వ్యక్తి బంగారం, వెండి వ్యాపారం చేస్తున్నారు. సందానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇస్మాయిల్‌గంజ్‌లో ఆయనకు దుకాణం ఉంది. అయితే, ధంతేరస్‌ రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. మంఝరి కూడలి సమీపంలో బైక్‌పై వచ్చిన నిందితులు వ్యాపారిని అడ్డగించారు. రస్తోగిపై దాడి చేసి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు తీవ్రత దృష్ట్యా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (ఐజీ) స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు, దోపిడీ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని ఎస్పీ అంకుర్ అగర్వాల్ పోలీసులను ఆదేశించారు. దీంతో గతంలోనే కొంతమంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.


ప్రధాన నిందితులైన ఇర్ఫాన్‌, దీపక్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఒక్కొక్కరిపై రూ.25 వేల చొప్పున ఎస్పీ రివార్డు ప్రకటించారు. ఈరోజు ఉదయం ఇద్దరు నేరస్థులు గణేష్‌పూర్ ప్రభుత్వ ట్యూబ్‌వెల్‌ సమీపంలో తలదాచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా.. నిందితులిద్దరికీ బుల్లెట్‌ గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, దుండగుల నుంచి దోచుకున్న సొత్తును, కాల్పులకు వినియోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇందిరాగాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారు.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై అకాలీదళ్ ఆగ్రహం!..

హోసూరు టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. ముగ్గురు కార్మికుల మృతి

Updated Date - Nov 10 , 2026 | 10:54 AM