Share News

జ్ఞానేశ్ బ్రో అంతా అయిపోయింది.. రాజీనామా సమయం వచ్చింది: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Oct 06 , 2026 | 03:51 PM

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీరంతా ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

జ్ఞానేశ్ బ్రో అంతా అయిపోయింది.. రాజీనామా సమయం వచ్చింది: రాహుల్ గాంధీ
MP Rahul Gandhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, సీఈసీ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీరంతా ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎవరూ తప్పించుకోలేరని, అందరూ త్వరలోనే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ హెచ్చరించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి మంగళవారం పార్లమెంట్ స్ట్రీట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ చేపట్టింది.


ఈ సందర్భంగా ఆకాశవాణి భవన్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశద్రోహంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. ‘బీజేపీని ఎదుర్కోవడం మాత్రమే మా లక్ష్యం కాదు.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం’ అని రాహుల్ అన్నారు. సర్‌లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్ కలిసి ఓటు చోరీతో దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో జ్ఞానేశ్ కుమార్ వారికి సహకరించారని రాహుల్ చెప్పుకొచ్చారు. ‘మేము వారిని కేవలం ఎదుర్కోవడం కాదు.. వారిని ఓడిస్తాం' అని రాహుల్ పేర్కొన్నారు.


ఢిల్లీలో ఉద్రిక్తత..

కాగా, ఈరోజు ఇండియా కూటమి చేపట్టిన మార్చ్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రతిపక్షం నిరసనకు దిగింది. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ఆకాశవాణి భవన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక రోడ్డుపైనే కూర్చొని నిరసనను కొనసాగించారు. ‘సుమారు 300 మంది ఎంపీలు ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కలవాలనుకుంటున్నారు. కానీ పోలీసులు మమ్మల్ని ఇక్కడే అడ్డుకున్నారు. 300 మంది ప్రతిపక్ష ఎంపీలు కలవాలనుకోవడంతో జ్ఞానేశ్ కుమార్ భయపడుతున్నారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.


ఈ సందర్భంగా జ్ఞానేశ్ కుమార్‌ను ఆర్ఎస్ఎస్ యూనిఫామ్‌లో చూపించే కటౌట్లను ప్రతిపక్ష ఎంపీలు చూపిస్తూ బీజేపీ, ఎన్నికల సంఘం చీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఓబ్రెయిన్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఓ పోస్టు పెట్టారు. ‘జ్ఞానేశ్.. అంతా అయిపోయింది బ్రో. రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాల్లో జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ఈ మేరకు సర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ అక్టోబర్ 6న మార్చ్‌కు పిలుపునిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

తీవ్ర విషాదం.. తల పైనుంచి ట్రాక్టర్ దూసుకెళ్లి యువ క్రీడాకారిణి మృతి..

ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..

Updated Date - Oct 06 , 2026 | 04:37 PM