Share News

తీవ్ర విషాదం.. తల పైనుంచి ట్రాక్టర్ దూసుకెళ్లి యువ క్రీడాకారిణి మృతి..

ABN , Publish Date - Oct 06 , 2026 | 03:08 PM

పంజాబ్‌లోని లూధియానాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీ పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడిన ఓ 14 ఏళ్ల హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి ప్రాణాలు కోల్పోయింది.

తీవ్ర విషాదం.. తల పైనుంచి ట్రాక్టర్ దూసుకెళ్లి యువ క్రీడాకారిణి మృతి..
Ludhiana Accident

లూధియానా: పంజాబ్‌లోని లూధియానాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీ పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడిన ఓ 14 ఏళ్ల హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి ప్రాణాలు కోల్పోయింది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్.. బాలిక తల పైనుంచి దూసుకెళ్లడంతో ఆమె మృతిచెందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాలికను 9వ తరగతి విద్యార్థిని అన్షికగా గుర్తించారు. సోమవారం సాయంత్రం ఆ క్రీడాకారిణి మరో ఇద్దరు బాలురతో కలిసి స్కూటీపై హ్యాండ్‌బాల్ ప్రాక్టీస్ కోసం పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. అన్షిక ప్రయాణిస్తున్న స్కూటీ 20 టన్నుల ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసింది. అదే సమయంలో ఎదురుగా మరో ద్విచక్ర వాహనం రావడంతో స్కూటీపై ఉన్న వారు ఒక్కసారిగా బ్రేకులు వేశారు. దీంతో అదుపుతప్పి ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. వెనుక కూర్చున్న అన్షిక పడిన సమయంలో ఆమె తల పైనుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే లూధియానాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.


రాష్ట్రస్థాయి పోటీకి వెళ్లాల్సి ఉండగా..

అన్షిక మంచి హ్యాండ్‌బాల్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మంగళవారం బఠిండాకు వెళ్లి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో తన జట్టు తరఫున పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే జరిగిన ఈ ప్రమాదం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, ట్రాక్టర్‌లో ఉన్న లోడ్ తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనాల్సిన ఓ యువ క్రీడాకారిణి ఇలా అకాల మరణం చెందడం లూధియానాలో తీవ్ర విషాదాన్ని నింపింది.


ఈ వార్తలు కూడా చదవండి

బారికేడ్ ఎక్కి రాహుల్ గాంధీ నిరసన.. సీఈసీ రాజీనామాకు డిమాండ్

మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

Updated Date - Oct 06 , 2026 | 03:28 PM