బారికేడ్ ఎక్కి రాహుల్ గాంధీ నిరసన.. సీఈసీ రాజీనామాకు డిమాండ్
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:02 PM
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు ప్రారంభించిన నిరసనలు నేడు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు భారీ నిరసనకు తెరతీశారు.
ఇంటర్నెట్ డెస్క్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు ప్రారంభించిన నిరసనలు నేడు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈసీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు భారీ నిరసనకు తెరతీశారు. విపక్ష ఎంపీలను అడ్డుకునేందుకు పోలీసులు ఈసీ కార్యాలయం ఎదుట బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఈసీ కార్యాలయానికి (నిర్వచన్ సదన్) కొద్ది దూరంలో రాహుల్ గాంధీ ఓ బారికేడ్ ఎక్కి నిరసనకు తెలిపారు. జాతీయ జెండాని ఊపుతూ రాహుల్ గాంధీ నిరసన తెలుపుతుండగా అక్కడే ఉన్న ఇతర నిరసనకారులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కాంగ్రెస్ నేతల నిరసన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పోలీసులు రాహుల్ గాంధీ, మరో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వారిని పోలీసు వాహనంలోకి తరలించారు. కానీ వారు వాహనం నుంచి దిగి మళ్లీ నిరసనకు తెరతీశారు. అక్కడే బైఠాయించి నిరసనను కొనసాగిస్తున్నారు.
పార్లమెంటు భవనం నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం నిర్వచన్ సదన్ వరకూ నేడు ప్రతిపక్ష ఎంపీలు మార్చి తలపెట్టిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ మార్చి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎంకే, ఆప్ మాత్రం దూరంగానే ఉండిపోయాయి. శీతాకాల పార్లమెంటు సమావేశాల వరకూ తమ నిరసనను కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకు కాంగ్రెస్ సోమవారం ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఈసీని చీటింగ్ కమిషన్ అంటూ విమర్శించడం ప్రారంభించింది. అక్టోబర్ 10 -20 తేదీల మధ్య సేవ్ ఓట్, సేవ్ డెమోక్రసీ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మండలస్థాయిలో బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకూ పలు చోట్ల ఈసీ తీరును ఎండగడుతూ బహిరంగ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మరో ర్యాలీని కూడా ప్లాన్ చేశారు. అదే నెలలో 25, 26 తేదీల్లో ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆరు ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్
చెన్నై పోర్టులో భారీగా చైనా బాణసంచా సీజ్.. రూ.12 కోట్ల సరుకు స్వాధీనం