నేడు సిద్దరామయ్య రాజీనామా!
ABN , Publish Date - May 28 , 2026 | 06:23 AM
కర్ణాటక ప్రభుత్వంలో ఒక్కరోజులోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా...
గవర్నర్ సమయం కోరిన సీఎంవో.. మంత్రులకు ఈరోజు అల్పాహార విందు
బెంగళూరు, మే 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభుత్వంలో ఒక్కరోజులోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ అప్పాయింట్‌మెంట్ కోరింది. ఈ క్రమంలో గురువారం ఉదయం అల్పాహార విందుకు రావాలని సీఎం సిద్దరామయ్య మంగళవారం రాత్రి మంత్రులకు ఆహ్వానం పంపారు. మంత్రులతోపాటు సీఎంకు ఆప్తులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ విందుకు హాజరవుతారని తెలిసింది. నెహ్రూ వర్ధంతిలో బుధవారం పాల్గొన్న సీఎం సిద్దరామయ్య, రాజకీయాలతోపాటు అన్ని విషయాల గురించి గురువారం మాట్లాడతానన్నారు.
జాతీయ రాజకీయాల్లో చాన్స్
సిద్దరామయ్యను రాజీనామా చేయాలని కోరిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆయనకు పలు ఆఫర్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యసభ టికెట్ ఇస్తామని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి.. వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. వీటన్నింటితోపాటు జాతీయ రాజకీయాల్లో కీలకమైన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు ఉపముఖ్యమంత్రి ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే, తాను జాతీయ రాజకీయాల్లోకి రాలేనని, హిందీ సమస్య కానుందని రాహుల్‌తో సిద్దరామయ్య అన్నట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదిలావుంటే, సీఎం సిద్దరామయ్యకు మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలా మంది ఆప్తులు ఉన్నారు. శాఖలతో నిమిత్తం లేకుండా, పలువురు మంత్రులు ఆయన ఎక్కడుంటే అక్కడ కనిపిస్తారు. ఢిల్లీకి వెళ్లినా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా పదిమందికిపైగా ఆప్తులు వెంట వెళ్తారు. చివరకు అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీకి వెళ్లినా.. ఆయన సన్నిహిత మంత్రులు, ఎమ్మెల్యేలు 40 మందికిపైగా అక్కడికీ వెళ్లారు. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య రాజీనామా తర్వాత జరిగే కీలకమైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తారా? లేదా? అనేది సందేహంగా మారింది. సిద్దరామయ్య రాజీనామా చేస్తే ఆందోళన చేయాలని ఆయన సామాజికవర్గానికి చెందిన కురుబ నేతలు నిర్ణయించారు. ‘అహింద’ నేతలు కూడా సిద్దరామయ్యకు మద్దతుగా నిలబడాలని భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీ్‌పసింగ్ సుర్జేవాలా బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్నారు.
పలువురు నాయకులు, మంత్రులతో ఆయన చర్చలు జరిపారు. మరోవైపు, డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన గురువారం ఉదయం బెంగళూరుకు చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు సీఎం సిద్దరామయ్య నివాసంలో.. అల్పాహార విందుకు హాజరుకానున్నారు. సిద్దరామయ్య రాజీనామా అనంతరం.. గురువారం సాయంత్రం సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును సిద్దరామయ్యే ప్రతిపాదించేలా అధిష్ఠానం నిర్ణయించింది. సిద్దరామయ్య రాజీనామా చేస్తున్న నేపథ్యంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలందరూ బెంగళూరుకు చేరుకుంటారని తెలిసింది.
నిర్ణయం తీసుకోలేదు: సుర్జేవాలా
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు. ఊహాగానాలు ప్రచారం చేయొద్దని మీడియాకు సూచించారు. సీఎల్పీ సమావేశానికి కూడా ఎలాంటి పిలుపు ఇవ్వలేదన్నారు. ఒకవేళ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. అది వ్యక్తుల కోణంలో కాదని, రాష్ట్ర కోణంలోనే ఉంటుందన్నారు. అయితే.. నెల, 20 రోజులు, ఆరు నెలల తర్వాత ఏం జరుగుతుందో తాను చెప్పలేనన్నారు. ‘‘ఊహాగానాలు ప్రచారం చేయొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నా.’’ అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News