Share News

ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

ABN , Publish Date - Mar 31 , 2026 | 09:00 PM

గుజరాత్‌ సూరత్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఓ చిన్నారి చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు..

ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

గాంధీ నగర్, మార్చి 31: గుజరాత్‌ సూరత్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఓ చిన్నారి చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

లింబాయత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిథీ ఖాదీ ప్రాంతంలో ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఫోమ్ షీట్లను ఉపయోగించి చీరలను ప్యాక్ చేస్తున్నారు. ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీమ్, అంబులెన్స్‌లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి.. ఇంట్లో అపస్మారకస్థితిలో పడిపోయిన బాధితులను బయటకు తీసుకువచ్చారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.


డీసీపీ కనన్ దేశాయ్ మాట్లాడుతూ.. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఇంట్లో చీరల ప్యాకింగ్ చేస్తుంటారు. ఇవాళ కూడా చీర ప్యాకింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యలు ముమ్మరం చేసి.. బాధితులను బయటకు తీసుకువచ్చాము. అప్పటికే వారు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దట్టమైన పొగ కారణంగా బాధితులను చేరుకోవడానికి చాలా సమయం పట్టింది.’ అని డీసీపీ వివరించారు.


‘బాధితులు చీరల ప్యాకింగ్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే ప్యాకింగ్ కోసం పెద్ద మొత్తంలో సామాగ్రి తీసుకువచ్చారు. ముందు గదిలో మొత్తం చీరల ప్యాకింగ్‌ కోసం వినియోగించే ఫోమ్ షీట్లు ఉన్నాయి. స్విచ్ బోర్డు వద్ద కూడా ఈ ఫోమ్ ఉంది. విద్యుత్ స్పార్క్ కారణంగానే మంటలు చెలరేగాయని భావిస్తున్నాం. స్విచ్ బోర్డు వద్ద పెట్టిన ఫోమ్‌లో విద్యుత్ స్పార్క్ పడి మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నాం. ఈ ఫోమ్‌లో రసాయనాలు కూడా ఉండటంతో.. మంటలతో పాటు దట్టమైన పొగ ఇల్లంతా కమ్మేసింది. విషపూరితమైన పొగ కారణంగా బాధితులు ఊపిరాడక చనిపోయారు. ఇంట్లోని పురుషులు పని మీద బయటకు వెళ్లగా.. మహిళలు చీరల ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నాం.’ అని డీసీపీ తెలిపారు.

కాగా, అగ్ని ప్రమాదంలో చనిపోయారు షెహనాజ్ బేగం అన్సారీ (65), హుసా బేగం అన్సారీ (18), షబీనా అన్సారీ (28), పర్విన్ అబ్దుల్ అన్సారీ (19), సుభాన్ అలీ అన్సారీ (4)గా గుర్తించినట్లు డీసీపీ తెలిపారు.


Also Read:

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: మంత్రి లోకేశ్

మాకు సాయం చేయలేదుగా.. ఇక మీ క్రూడ్ ఆయిల్‌ను మీరే తెచ్చుకోండి: ట్రంప్

రాజధానిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టండి.. పార్టీ శ్రేణులకు సీఎం పిలుపు

Updated Date - Mar 31 , 2026 | 10:18 PM