Share News

మాకు సాయం చేయలేదుగా.. ఇక మీ క్రూడ్ ఆయిల్‌ను మీరే తెచ్చుకోండి: ట్రంప్

ABN , Publish Date - Mar 31 , 2026 | 08:18 PM

ఇరాన్‌పై దాడుల విషయంలో తమకు సహకరించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మండిపడ్డారు. ఆయా దేశాలు హోర్ముజ్‌కు వెళ్లి తమ ముడి చమురును తామే తెచ్చుకోవాలని అన్నారు. అమెరికా ఎల్లకాలం సాయం చేయదని చెప్పారు.

మాకు సాయం చేయలేదుగా.. ఇక మీ క్రూడ్ ఆయిల్‌ను మీరే తెచ్చుకోండి: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై దాడుల్లో తమకు సహకరించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. యూఎస్‌కు సహకరించని దేశాలు హోర్ముజ్‌ జలసంధికి వెళ్లి ముడి చమురును తెచ్చుకోవాలని అన్నారు. అది కుదరకపోతే అమెరికా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు పెట్టారు.

‘ఇరాన్‌ విషయంలో యూఎస్‌కు సాయం చేయక చివరకు హోర్ముజ్ జలసంధి నుంచి చమురును తెచ్చుకోలేకపోతున్న బ్రిటన్ వంటి దేశాలకు నేను ఒక సూచన చేస్తున్నాను. మీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి యూఎస్ నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలి. మా వద్ద అది సమృద్ధిగా ఉంది. రెండోది కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుని హోర్ముజ్‌కు వెళ్లి చమురును తెచ్చుకోవాలి. మీ కోసం మీరు పోరాడటాన్ని ఇకపై మీరు నేర్చుకోవాలి. యూఎస్‌ మీకు ఎల్లప్పుడూ సాయంగా వస్తుందని అనుకోవద్దు. మీరూ మాకు సహాయం చేయలేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇరాన్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కష్టమైన ఈ పనిని మేము పూర్తి చేశాము. ఇక మీ ముడి చమురును మీరే వెళ్లి తెచ్చుకోండి’ అని ట్రంప్ పోస్టు పెట్టారు.


గల్ఫ్ ఉద్రిక్తతలు మొదలై నెల రోజులు దాటిపోయినా ఇరాన్ ఇప్పటికీ హోర్ముజ్‌పై తన పట్టును సడలించని విషయం తెలిసిందే. ఈ జలసంధి మీదుగా చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్స్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.


ఈ వార్తలూ చదవండి:

ఉక్రెయిన్‌‌ను సాయం కోరిన గల్ఫ్ దేశాలు! ఇరాన్‌కు చెక్ పెట్టే డీల్!

పాక్‌లో మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి

Updated Date - Mar 31 , 2026 | 08:25 PM