పాక్‌లో మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి
ABN , Publish Date - Mar 31 , 2026 | 03:29 PM
భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థకు గట్టి దెబ్బ తగలింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడైన మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో మరణించాడు.
ఇస్లామాబాద్: భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థకు గట్టి దెబ్బ తగలింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజహర్ (Masood Azhar) సోదరుడైన మహమ్మద్ తాహిర్ అన్వర్ (Mohammed Tahir Anwar) పాకిస్థాన్‌లో మరణించాడు. అయితే ఆయన మరణానికి కారణంపై స్పష్టత లేదు. జైషే ఉగ్రవాద సంస్థతోనూ, ఆ సంస్థ కార్యకలాపాలతోనూ తాహిర్‌కు చాలా ఏళ్లుగా సంబంధాలున్నాయి. తాహిర్ మృతిని జైషే సంస్థ టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రకటించింది. బహవల్పూర్‌లో జామియా ఉస్మాన్ వలీలో అతని అంత్యక్రియలు జరుపుతున్నట్టు తెలిపింది.
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ఇండియాలోని పలు ఉగ్రదాడుల ఘటనల్లో ప్రమేయం ఉంది. 2002లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, 19 మంది సైనికులను పొట్టనపెట్టుకున్న ఉరి దాడి, 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన 2019 పుల్వామా బాంబింగ్ ఘటనల్లో జైషే మహమ్మద్ పాత్ర ఉంది.
గత ఏడాది ఏప్రిల్ 22న పాక్ ఉగ్రవాదులు పుల్వామాలో దాడి చేయడంతో 26 మంది టూరిస్టులు మరణించారు. ఇందుకు ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత భద్రతా బలగాలు పాక్‌లోకి చొచ్చుకుపోయి దాడులు జరిపాయి. బహవల్పూర్‌లోని జైషే స్థావరాలపై కూడా భీకర దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో మసూద్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు సహా ఆయన కుటుంబానికి చెందిన 10 మందికి పైగా మృతి చెందారు. పలువురు మసూద్ అనుచరులు సైతం హతులయ్యారు. ఈ దాడుల్లో ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు గత సెప్టెంబర్‌లో మసూద్ ధ్రువీకరించాడు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక