Share News

ఘజియాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం..

ABN , Publish Date - Jul 11 , 2026 | 08:35 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ బేస్‌మెంట్‌లో ఏడేళ్ల చిన్నారి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. పోస్టుమార్టం నివేదికలో బాలికపై హత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఘజియాబాద్‌లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం..
Uttar Pradesh

ఘజియాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ బేస్‌మెంట్‌లో ఏడేళ్ల చిన్నారి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. పోస్టుమార్టం నివేదికలో బాలికపై హత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని నంద్‌గ్రామ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు అదే నిర్మాణ స్థలంలో కూలీలుగా పనిచేస్తూ అక్కడే ఓ గుడిసెలో నివసిస్తున్నారు.


చిన్నారి శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. శనివారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న ఆ మాల్ బేస్‌మెంట్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతదేహంపై తీవ్రగాయాలు ఉండటం, పలు ఎముకలు విరిగిన ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే నంద్‌గ్రామ్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని మాల్ మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో భాగంగా అనుమానిస్తున్నారు. అయితే ఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది.


కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, హత్య, అపహరణ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు నలుగురు నుంచి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, చిన్నారి మృతదేహం లభించిన వార్తతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఓ భద్రతా సిబ్బందిపై దాడికి ప్రయత్నించగా.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలు మోహరించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, అనుమానితుల విచారణ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

వియత్నాంలో 15 మంది భారతీయుల మృతి.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ..

మూగబోయిన మధుర గానం.. శాశ్వత నిద్రలోకి ఎస్.జానకి

Updated Date - Jul 11 , 2026 | 08:38 PM