రోగికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు.. నెటిజన్ల ఆగ్రహం
ABN , Publish Date - Apr 21 , 2026 | 10:50 AM
ఆపరేషన్ థియేటర్‌లో టేబుల్ మీద పడుకున్న వ్యక్తికి సెక్యూరిటీ గార్డు కుట్లు వేస్తున్న.. ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాట్నా, ఏప్రిల్ 21: ఆపరేషన్ థియేటర్‌లో టేబుల్ మీద పడుకున్న వ్యక్తికి సెక్యూరిటీ గార్డు కుట్లు వేస్తున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు చేయాల్సిన చికిత్స.. ఇలా సెక్యూరిటీ గార్డు చేయడంతో ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌లోకి ఎవరినైనా పంపిస్తారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలో బగాహా పట్టణంలోని సబ్ డివిజనల్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది.
బగాహా సమీపంలోని రహదారిపై టెంపో, వ్యాన్ ఢీకున్నాయి. అందులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని స్థానికులు బగాహాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో.. అతడికి కుట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సెక్యూరిటీ గార్డు ఈ కుట్లు వేసినట్లు చెబుతున్నారు. దీనిపై ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తివారీ స్పందించారు.
ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ పరిస్థితి చాలా కాలంగా ఉందని తెలిపారు. ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను జనరల్ సర్జన్ మిడ్‌వైఫరీలతో అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన చోటు చేసుకున్న రోజు.. సుమారు ఆర డజను మంది వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన రోగులు ఒకేసారి ఆసుపత్రికి వచ్చారని వివరించారు. ఒక రోగికి తీవ్రంగా రక్తస్రావం కావడం చూసి, వైద్యుడి పర్యవేక్షణలో సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు.
మరో వైపు తమకు తగిలిన గాయాలకు సెక్యూరిటీ గార్డు కుట్లు వేశాడని వ్యాన్ డ్రైవర్ వాసీమ్ అక్తర్‌తోపాటు మరో బాధితుడు సురేందర్ పైసీ వెల్లడించడం గమనార్హం. రాష్ట్రంలో వైద్య శాఖలో వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన గణాంకాలను సైతం ఇప్పటికే కాగ్ విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకిని కొనుక్కొచ్చి.. పిండాన్ని ముట్టించి..
జనరల్ స్టోర్‌లో చోరీ.. పోలీసులను ఆశ్రయించిన యజమాని
For More National News And Telugu News