Share News

శాకాహార మాంసం!

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:48 AM

ప్రస్తుతం మార్కెట్లో మొక్కల ఆధారిత మాంస ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. సోయా, బఠాణీ, గోధుమ ప్రొటీన్‌ వంటి వాటితో తయారుచేసే ఆయా ఉత్పత్తులు చూడ్డానికి మాత్రమే మాంసంలా ఉంటాయి...

శాకాహార మాంసం!

  • పొగాకు, లెట్యూస్‌ మొక్కల ద్వారా మయోగ్లోబిన్‌

  • అనే కీలక ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసిన శాస్త్రజ్ఞులు

  • జంతు మాంసానికి రంగు, రుచి ఇచ్చే ప్రొటీన్‌ అదే

  • కిలో పొగాకు నుంచి 800 మిల్లీగ్రాముల ప్రొటీన్‌

  • ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొక్కల ఆధారిత మాంస

  • ఉత్పత్తులకు దీన్ని జోడిస్తే నిజమైన మాంసం రుచి!

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రస్తుతం మార్కెట్లో మొక్కల ఆధారిత మాంస ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. సోయా, బఠాణీ, గోధుమ ప్రొటీన్‌ వంటి వాటితో తయారుచేసే ఆయా ఉత్పత్తులు చూడ్డానికి మాత్రమే మాంసంలా ఉంటాయి తప్ప సహజమైన మాంసం రంగు, రుచి వాటికి ఉండవు. ఈ సమస్యను అధిగమించడానికి ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌, క్మోమి లిమిటెడ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, చైనాలోని నాన్‌చాంగ్‌ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ఒక కీలక ప్రయోగం చేసి.. పొగాకు, లెట్యూస్‌ మొక్కల ద్వారా.. మయోగ్లోబిన్‌ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయగలిగారు. జంతువుల మాంసానికి ఉండే ప్రత్యేకమైన రంగు, రుచి ఇచ్చే కీలక ప్రొటీన్‌ అదే. ప్రయోగంలో భాగంగా వారు జంతువుల గుండె కండరాల్లో, అస్థిపంజర కండరాల్లో ఉండే కీలకమైన మయోగ్లోబిన్‌ జన్యువును సేకరించారు. అనంతరం ‘జీన్‌ గన్‌’ అనే పరికరం ద్వారా పొగాకు, లెట్యూస్‌ మొక్కల ఆకుల్లోని హరితరేణువుల జన్యుక్రమంలోకి ఆ జన్యువును చొప్పించారు. ఈ హరిత రేణువులు కిరణ జన్య సంయోగ క్రియలో అత్యంత కీలకపాత్ర పోషాస్తాయి. కణకేంద్రకం కంటే ఈ హరిత రేణువుల్లో జన్యువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అవి శాస్త్రవేత్తలు అంచనా వేసినట్టుగానే మయోగ్లోబిన్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయగలిగాయి. అంతేకాదు.. ఆ మొక్కల నుంచి వచ్చిన విత్తనాలను నాటడం ద్వారా మొలకెత్తిన మొక్కలు సైతం మయోగ్లోబిన్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడం గమనార్హం. ప్రతి కిలో పొడి పొగాకు నుంచి 800 మిల్లీ గ్రాములు, కిలో లెట్యూస్‌ ఆకుల నుంచి 810 మిల్లీగ్రాముల చొప్పున ఈ ప్రొటీన్‌ ఉత్పత్తి అయ్యిందని శాస్త్రజ్ఞులు తెలిపారు.


సాధారణంగా పశువుల పెంపకానికి అధిక నీరు, భూమి అవసరమవుతాయి. వాటి పెంపకంలో మీథేన్‌, ఇతర కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడతాయి. కానీ.. ఒక హెక్టారు భూమిలో పశువుల పెంపకం ద్వారా వచ్చే ప్రొటీన్‌ కంటే ఈ విధానం ద్వారా ఎక్కువ ప్రొటీన్‌ ఉత్పత్తి చేయవచ్చని, నీటివాడకం, కర్బన ఉద్గారాల విడుదల కూడా గణనీయంగా తక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు వివరించారు. ఈ ఆవిష్కరణ వాణిజ్యపరంగా అందుబాటులోకి రావాలంటే మొక్కల ఆకుల నుంచి మయోగ్లోబిన్‌ను వేరు చేసి, శుద్ధి చేసే పరిశ్రమ స్థాయి విధానాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. అందుకు ప్రభుత్వ అనుమతులు అవసరం. అలా శుద్ధి చేసిన ప్రొటీన్‌ను మొక్కల ఆధారిత మాంసానికి జోడిస్తే.. దానికి నిజమైన మాంసం రంగు, రుచి వస్తాయి. అప్పుడా మాంసాన్ని ఉడికించినా/కాల్చినా నిజమైన మాంసంలాగానే రంగు మారుతుంది. ఆ రుచి కూడా వస్తుంది.

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 05:48 AM