Share News

‘స్కూల్‌ ఠీక్‌ కరో..’ పంద్రాగస్టు వేళ

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:31 AM

ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడంలో అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే విమర్శించారు. పంద్రాగస్టు సందర్భంగా...

‘స్కూల్‌ ఠీక్‌ కరో..’ పంద్రాగస్టు వేళ

కాక్రోచ్‌ల మరో ఉద్యమం

8 మహారాష్ట్రలో ప్రారంభించిన దీప్కే

హింగోలీ (మహారాష్ట్ర), ఆగస్టు 15: ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడంలో అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే విమర్శించారు. పంద్రాగస్టు సందర్భంగా శనివారం మహారాష్ట్ర హింగోలీ జిల్లాలోని తన స్వగ్రామం సంతుక్‌ పింప్రీలో ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ (బడులను బాగు చేయండి) ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రైవేటు పాఠశాలలు పిల్లల నుంచి వసూలుచేస్తున్న ఫీజులపై నియంత్రణ విధించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రాజకీయ సంవాదం దిశాదశలను పట్టణాల్లో కూర్చున్నవాళ్లు కాదు, పల్లె జనం నిర్ణయిస్తారని దీప్కే వ్యాఖ్యానించారు. తన ప్రాంతంలోని జిల్లా పరిషత్‌ స్కూలును సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. తగినన్ని మరుగుదొడ్లు, సరైన మంచినీటి వ్యవస్థ అక్కడ లేకపోవడాన్ని గమనించారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించి 80 ఏళ్లయినా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో నీటి వసతి లేకపోవడం ఏంటి? ఈ పరిస్థితుల్లో దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? నేను సందర్శించిన స్కూలులో తరగతి గది కిటికీ తలుపులు విరిగిపోయాయి. గదిలోకి ఎండ పడకుండా, వాటికి అడ్డుగా ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే ఫొటోలు ఉన్న బ్యానర్లు పెట్టారు. దేశ పరిస్థితులను ఎగతాళి చేస్తున్నట్టు ఈ బ్యానర్లు ఉన్నాయి. నేను వస్తానని తెలుసుకుని బాత్రూమ్‌లను అప్పటికప్పుడు నీళ్లతో కడిగారు.’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమ కార్యాచరణ ఇలా..

ప్రాథమిక పాఠశాలల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలతో జాబితా పత్రాన్ని తయారుచేశామని అభిజీత్‌ దీప్కే తెలిపారు. దాని ఆధారంగా మహారాష్ట్ర, తక్కిన దేశమంతా ప్రాథమిక పాఠశాలల వాస్తవ స్థితిపై కచ్చితమైన వివరాలు సేకరిస్తామని, అనంతరం వాటన్నింటినీ క్రోడీకరించి నివేదికలు తయారుచేస్తామని వివరించారు. ప్రభుత్వాలకు ఆ నివేదికలను ఇచ్చి, వాటి ఆధారంగా చర్యలు తీసుకునేందుకు నిర్ణీత గడువు ఇస్తామని చెప్పారు. ఆ గడువు ముగిసిన తర్వాత.. రెండో దశ ఉద్యమంలో భాగంగా మరోసారి ప్రాథమిక పాఠశాలలను సందర్శిస్తామని చెప్పారు. విద్యా బడ్జెట్‌ను కేంద్రం కుదిస్తుండటం విచారకరమని దీప్కే అన్నారు. ‘‘ప్రైవేటు స్కూళ్లకు లబ్ధి చేకూర్చేందుకు చాలా చోట్ల ప్రభుత్వ బడులను మూసి వేస్తున్నారు. గత పదేళ్లలోనే దేశవ్యాప్తంగా 94,000 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. పిల్లలకు మరిన్ని బడులను అందుబాటులోకి తీసుకురావాల్సిన తరుణంలో, ఉన్నవాటినీ మూసివేయడం ఏంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రాథమిక ఆరోగ్యంపైనా త్వరలో ఉద్యమం ప్రారంభిస్తామని దీప్కే వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 06:31 AM