సర్దార్ పటేల్ 151వ జయంతి.. జాతీయ ఐక్యతా దివస్ సందర్భంగా ప్రముఖుల నివాళులు!
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:58 AM
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దివస్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని తదితరులు పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు.
ఢిల్లీ, అక్టోబర్ 31: భారత ఉక్కు మనిషి (Iron Man of India), దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ఇవాళ (అక్టోబర్ 31) దేశవ్యాప్తంగా 'జాతీయ ఐక్యతా దివస్' ఘనంగా జరుపుకుంటున్నారు. రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు నాయకులు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.(Sardar Patel 151st Jayanti)
ఢిల్లీలో ప్రముఖుల అంజలి
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి: ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు పాల్గొని పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కూడా పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నివాళులర్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సందేశం
ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సర్దార్ పటేల్‌ను 'అఖండ భారత్ శిల్పి' అని కొనియాడారు. బలమైన, సమర్థవంతమైన, స్వయంసమృద్ధి కలిగిన భారతదేశ నిర్మాణానికి పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన త్యాగం వికసిత భారత్ నిర్మాణానికి ప్రేరణ అని పేర్కొన్నారు.
హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
సర్దార్ పటేల్ ఆధునిక భారతదేశానికి పునాది వేసిన శిల్పి అని కొనియాడారు. సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఒక్కటిగా నిర్మించడంలో ఆయన చూపిన ధైర్యం, సుదూర ఆలోచన చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ను ఏర్పాటు చేసి దేశ పాలనా వ్యవస్థకు బలమైన ఆధారాన్ని అందించారని, ఖేడా, బార్డోలీ సత్యాగ్రహాల ద్వారా రైతుల హక్కుల కోసం పోరాడారని అమిత్ షా గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి...
మరికొద్ది రోజుల్లో గగన్‌యాన్ D1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి
కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్
Read Latest AP News And Telugu News