రష్యా సైన్యంలో భారతీయ బాధిత కుటుంబాలకు పరిహారం వేగవంతం చేయాలి: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Oct 14 , 2026 | 03:48 PM
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో బాధితులైన భారతీయుల కుటుంబాలకు పరిహార ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రష్యా సైన్యంలో భారతీయుల మరణంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఢిల్లీ, అక్టోబర్14: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో బాధితులైన భారతీయుల కుటుంబాలకు పరిహార ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రష్యా సైన్యంలో భారతీయుల మరణంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో బాధిత కుటుంబాల కోసం వెంటనే ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే రష్యా సైన్యంలో మరణించిన భారతీయులకు డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించాలని.. ఇక బాధిత కుటుంబాలకు పరిహారం వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
రష్యాలో భాష తెలియక ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలకు ప్రాంతీయ భాషల్లో సులభంగా సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన సూచన చేసింది. ఏజెంట్ల మోసపూరిత ప్రకటనలను నమ్మి రష్యా వెళ్లిన వారిలో 49 మందిపైగా భారతీయులు మరణించారని సుప్రీంకోర్టు దృష్టికి ఈ సందర్భంగా కేంద్రం తీసుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దౌత్య పరమైన చర్యల కారణంగా.. రష్యా సైన్యం నుంచి 139 మందికి పైగా భారతీయులు సురక్షితంగా విడుదలయ్యారని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది.