జెన్-జీ దేశ వ్యతిరేకులు కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్..
ABN , Publish Date - Aug 06 , 2026 | 07:47 PM
జెన్-జీ యువత దేశ వ్యతిరేకులు కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు సమర్థనీయమైనవేనని పేర్కొన్నారు.
ముంబై: జెన్-జీ (Gen Z) యువత దేశ వ్యతిరేకులు కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు సమర్థనీయమైనవేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు అనేవి సంభాషణకు, సమస్యల పరిష్కారానికి దోహదపడే మార్గాలని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో నిర్వహించిన ఐఐఎమ్‌యూఎన్ (IIMUN) సమావేశంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. అనంతరం జెన్-జీ, జెన్-ఆల్ఫా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ.. తమ కాలంలో పెద్దల మాటకు ప్రాధాన్యం ఇచ్చేవారమని, అయితే నేటి జెన్-జీ ప్రతి అంశానికి తార్కిక వివరణలు కోరుకుంటోందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశ్నించడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, నిరసనలు తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కులేనని మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు. అయితే నిరసనలు చేపట్టేందుకు ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయని యువత గుర్తించాలని సూచించారు.
యువత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుంటూ వారితో నిరంతర సంభాషణ కొనసాగించడం అవసరమని మోహన్ భాగవత్ చెప్పారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లా నేనూ బాధితుడినే.. కోర్టు తీర్పు అనంతరం తరుణ్ తేజ్‌పాల్
ఎయిర్ గన్‌తో కాల్పులకు తెగబడిన టెకీ.. సెక్యూరిటీ సిబ్బంది, వాహనాలపై పెల్లెట్ల వర్షం..