Share News

హనీ ట్రాప్‌తో గ్యాంగ్‌స్టర్‌ టార్గెట్.. రోహ్‌తక్ హోటల్ కాల్పుల వెనుక షాకింగ్ ట్విస్ట్!

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:33 PM

హర్యానాలోని రోహ్‌తక్ హోటల్‌లో జరిగిన నలుగురి హత్యల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ సన్నీ రిటోలియాను హతమార్చేందుకు హనీ ట్రాప్‌తో భారీ కుట్ర పన్నినట్లు సమాచారం.

హనీ ట్రాప్‌తో గ్యాంగ్‌స్టర్‌ టార్గెట్.. రోహ్‌తక్ హోటల్ కాల్పుల వెనుక షాకింగ్ ట్విస్ట్!

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని రోహ్‌తక్‌లో మిలన్ హోటల్‌లో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. టార్గెట్ చేసిన వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ సన్నీ రిటోలియాను హతమార్చేందుకు గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు ముఠా పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ కుట్రలో హనీ ట్రాప్‌ను ప్రధాన అస్త్రంగా ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం ఓ మహిళను రంగంలోకి దించి.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సుమారు మూడున్నర నెలల పాటు సన్నీ రిటోలియాతో పరిచయం పెంచినట్లు సమాచారం. క్రమంగా అతనికి దగ్గరై నమ్మకాన్ని సంపాదించిన ఆ మహిళ.. అతని కదలికలు, ఆచూకీ గురించి ప్రత్యర్థి ముఠాకు సమాచారం అందించినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంలో హిమాన్షు భావు అనుచరుడు సాహిల్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన సోదరుడు రోహిత్, మామ బజరంగ్ హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే భావు ఈ కుట్రకు తెరతీసినట్లు సమాచారం. సన్నీ రిటోలియా ఆచూకీ అందించినందుకు ప్రతిఫలంగా ఆ మహిళకు అమెరికాకు సురక్షితంగా పంపడంతో పాటు అక్కడ స్థిరపడేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.


ఈ కుట్రలో భాగంగా సన్నీ రిటోలియా ఆ మహిళతో పాటు తన ముగ్గురు అనుచరులు రింకు, యశ్, వినీత్‌లతో కలిసి రాత్రి భోజనం చేసేందుకు రోహ్‌తక్‌లోని మిలన్ హోటల్‌కు వెళ్లాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో హోటల్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో రిటోలియా ప్రాణాలతో బయటపడగా.. అతని ముగ్గురు సహచరులు మృతి చెందారు. మరోవైపు, తన మేనమామను కలిసేందుకు భలౌత్‌కు వచ్చిన హిమాన్షు అనే వ్యక్తి కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమయంలో హోటల్‌లో సుమారు 40 నుంచి 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కనిపించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం రోహ్‌తక్, ఝజ్జర్ పోలీసులకు చెందిన సుమారు పది ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత

ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 12:36 PM