బ్యాంక్ ఖాతాకు స్టాప్ స్విచ్
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:06 AM
డిజిటల్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు తమ అకౌంట్లపై మరిన్ని అధికారాలు కట్టబెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడుగులు వేస్తోంది.
కోరుకున్నప్పుడు డిజిటల్ పేమెంట్స్‌నునిలిపివేసే చాన్స్..ఆర్బీఐ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, నవంబరు 23: డిజిటల్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు తమ అకౌంట్లపై మరిన్ని అధికారాలు కట్టబెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడుగులు వేస్తోంది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఎప్పుడంటే అప్పుడు ఖాతాదారుడు స్విచాఫ్, స్విచాన్ చేసుకొనేలా నిబంధనలు రూపొందిస్తోంది. అంతేకాదు.. ఒక పరిమితికి మించి అకౌంట్ నుంచి డబ్బును ఎవరికైనా పంపాలంటే ఖాతాదారుడికి నమ్మకమైన మూడో వ్యక్తి అనుమతి తప్పనిసరి చేసే ఆప్షనల్ విధానాన్ని కూడా తీసుకురావాలని భావిస్తోంది. తాజాగా ప్రతిపాదించిన చర్చాపత్రంలో ఈ వివరాలను చేర్చింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే బ్యాంకులు ఖాతాదారుడికి తన ఖాతాకు లింకు చేసి ఉన్న ఇంటర్నెట్, మెబైల్, ఇతర డిజిటల్ సేవలను స్విచాఫ్ చేసుకొనే అధికారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిని నిలిపివేయాలంటే ఖాతాదారుడు బ్యాంకుకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకు అనుమతితో అవసరం లేకుండా ఖాతాదారుడు నేరుగా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేసుకోవచ్చు. కొత్త బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు దానికి బ్యాంకు నేరుగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అనుసంధానించటానికి వీలుండదు. ఖాతాదారుడి అనుమతి తీసుకున్న తర్వాతే బ్యాంకు ఆ సౌకర్యాన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన విషయం ‘స్టాప్ స్విచ్’. డిజిటల్ మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని ఖాతాదారుడికి అనుమానం వస్తే.. తన ఖాతా నుంచి సమీప భవిష్యత్తులో ఎవరికీ డబ్బు వెళ్లకుండా స్వయంగా నిషేధం విధించుకోవచ్చు.
ఖాతాలకు ‘నమ్మకస్తుడి’ భద్రత
‘ట్రస్టెడ్ పర్సన్ మెకానిజం’ అనే మరో కీలక ప్రతిపాదన కూడా ముసాయిదాలో ఉంది. ఒక ఖాతాదారుడు తన ఖాతా నుంచి ఒక పరిమితికి మించి డిజిటల్ పేమెంట్స్ విధానంలో డబ్బు పంపాలంటే తనకు నమ్మకమైన మూడో వ్యక్తి అనుమతి తప్పనిసరి చేసేలా ఈ విధానం ఉంటుంది. ఉదాహరణకు ఖాతాదారుడు డిజిటల్ పేమెంట్స్ ద్వారా రూ.50 వేలకు మించకుండా చెల్లింపులు జరగాలని లిమిట్ పెట్టుకున్నాడు అనుకుందాం.. అప్పుడు ఆ ఖాతా నుంచి రూ.50 వేలకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే ట్రస్టెడ్ పర్సన్‌కు ఆ చెల్లింపునకు అనుమతి కోరుతూ సందేశం వెళ్తుంది. దానికి ఆ వ్యక్తి అనుమతిస్తే చెల్లింపు జరిగిపోతుంది. లేదంటే ఒక గంట తర్వాత ఆ చెల్లింపు దానంతట అదే రద్దవుతుంది. ఇళ్లలో పిల్లల బ్యాంకు అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టేయకుండా ఈ విధానం దోహదపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది. కొత్త నిబంధనల్లో కొన్నింటిని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, మరికొన్నింటిని జూన్ 1 నుంచి అమలు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం
కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట..!