Share News

6 నెలల్లో 23 మందికి మరణశిక్షలు.. జడ్జి రవికుమార్ దివాకర్ బదిలీ

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:20 PM

ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ బదిలీ అయ్యారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య 11 కేసుల్లో 23 మందికి మరణశిక్ష విధించిన ఆయనను ఫ్యామిలీ కోర్టుకు అదనపు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

6 నెలల్లో 23 మందికి మరణశిక్షలు.. జడ్జి రవికుమార్ దివాకర్ బదిలీ
Judge Ravi Kumar Diwakar Transfer

ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 25: ఇటీవల దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తిగా పని చేస్తున్న రవి కుమార్ దివాకర్ బదిలీ అయ్యారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కేవలం ఆరు నెలల్లో 11 కేసుల్లో 23 మందికి న్యాయమూర్తి రవికుమార్ మరణశిక్ష విధించి అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు బరేలీలో కూడా అనేక మరణశిక్షలు విధించి మొత్తం 35 మరణశిక్షల రికార్డు సృష్టించారు.

అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రవికుమార్‌ను ఇప్పుడు ముజఫర్ నగర్ ఫ్యామిలీ కోర్టుకు అదనపు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు శివ కుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు.

బదిలీ నేపథ్యం

ఆగస్టు 2026లో అప్పటి జిల్లా సెషన్స్ జడ్జి.. అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వుల ద్వారా, జడ్జి దివాకర్ కోర్టులో విచారణలో ఉన్న సుమారు 97 హత్య, తీవ్రమైన నేరాల కేస్‌ల ఫైళ్లను వేరే కోర్టులకు తరలించారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక తీర్పులో ఆయన ఘాటుగా మాట్లాడుతూ.. ' న్యాయమూర్తి పని న్యాయం చేయడమే. కానీ తనకే అన్యాయం జరిగితే ఆయన ఎవరి దగ్గరికి వెళ్లాలి?' అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మాఫియా నుంచి తనకు బదిలీ బెదిరింపులు వచ్చాయని చెప్పారు. అయినా తాను న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 'పిరికి న్యాయమూర్తిగా పిలిపించుకోవడం కంటే చావే మేలు. నేను సీటులో ఉన్నంత కాలం న్యాయ సూత్రాలకే ప్రాధాన్యం ఇస్తాను' అని ఆయన అన్నారు.

కాగా, రవి కుమార్ దివాకర్ 2009లో ఉత్తర్ ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసులో చేరారు. వారణాసి, బరేలీ తదితర జిల్లాల్లో పని చేశారు. 2022లో వారణాసిలో జ్ఞానవాపి మసీదు సముదాయం వీడియోగ్రాఫిక్ సర్వే ఆదేశించినప్పుడు మొదటిసారి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. 2025 నవంబర్‌లో ముజఫర్ నగర్‌కు బదిలీ అయ్యారు. (Judge Ravi Kumar Diwakar Transfer)


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 07:44 PM