Share News

అయోధ్య విరాళాల దుర్వినియోగం.. ఉద్యోగాల కోసం లంచం తీసుకున్నారా..

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:28 PM

అయోధ్యలోని రామ మందిర విరాళాల దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ కేసులో మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించింది.

అయోధ్య విరాళాల దుర్వినియోగం.. ఉద్యోగాల కోసం లంచం తీసుకున్నారా..
Ram Mandir donation theft

అయోధ్యలోని రామ మందిర విరాళాల దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ కేసులో మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దృష్టి సారించింది. ఇప్పటికే అరెస్టైన నిందితులను విచారించగా అనిల్ మిశ్రా పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గత వారం ఆయన ట్రస్టీ పదవికి రాజీనామా చేశారు (Ram Mandir donation theft).


దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ప్రకారం.. రామ మందిరంలో పనిచేస్తున్న కనీసం 125 మంది ఉద్యోగులు అనిల్ మిశ్రా (Anil Mishra) సిఫార్సుతోనే నియమితులయ్యారని అధికారులు అనుమానిస్తున్నారు. ఉద్యోగాల కోసం అనిల్ మిశ్రా లంచాలు కూడా తీసుకున్నారనే ఆరోపణలపై సిట్ విచారణ కొనసాగిస్తోంది. అంతేకాకుండా, ట్రస్టీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆస్తులు ఎంత మేర పెరిగాయనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.


ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితుల్లో అనుకల్ప్ మిశ్రా, లవ్ కుశ్ మిశ్రా ఉన్నారు. నిధులు కాజేయడంలో వీరి పాత్ర కూడా కీలకమైనదని, వీరిద్దరూ అనిల్ మిశ్రా బంధువులని అధికారులు భావిస్తున్నారు. కాగా, నిందితులు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ప్రత్యేక పద్ధతిని అనుసరించి నిధులను కాజేసినట్టు విచారణలో బయటపడింది (SIT probe).


ఒక వ్యక్తి నగదును తీసుకెళ్లే సమయంలో మిగిలినవారు అతడి చుట్టూ కెమెరాకు అడ్డుగా నిలబడేవారని అధికారులు తెలిపారు. నగదును సమీపంలోని బాత్‌రూమ్‌లో దాచిపెట్టి, అవకాశం దొరికినప్పుడల్లా బయటకు తీసుకెళ్లేవారని వెల్లడైంది. ట్రస్టు అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో వారిని ఎవరూ తనిఖీ చేయలేదని కూడా దర్యాప్తులో తేలింది (Ayodhya Ram Mandir).


ఇక, కౌంటింగ్ రూమ్‌కు చెందిన ఒక తాళం చెవి నిందితులలో ఒకడైన టిన్నూ యాదవ్ దగ్గరా, మరొకటి బ్యాంకు సిబ్బంది దగ్గర ఉండేది. నాలుగు విరాళాల పెట్టెలలో జమ చేసిన నగదును, 11 మంది బ్యాంకు సిబ్బంది, ఆలయ ట్రస్ట్ నుంచి మరో ముగ్గురితో సహా మొత్తం 14 మంది సభ్యుల బృందం లెక్కించేది. వీరందరి పాత్రపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు సాగిస్తోంది.


ఆలయంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం, సీసీటీవీ ఫుటేజీని నిర్ణీత కాలం పాటు భద్రపరచకపోవడంతో పాటు విరాళాల లెక్కింపు ప్రక్రియలో కూడా అనేక లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం (Ram Temple donation case).


ఇవి కూడా చదవండి..

భారత్ క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది.. చుట్టూ కఠినమైన దేశాలు: అమెరికా రాయబారి


మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 01 , 2026 | 12:39 PM