రక్షాబంధన్ వేళ తమ్ముడికి కొత్త జీవితమిచ్చిన అక్క.. వీరి ప్రేమ వేరే లెవల్..
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:33 PM
రక్షాబంధన్ వేళ ఓ మహిళ తన తమ్ముడికి జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చింది. రెండున్నరేళ్లుగా సోదరుడు పడుతున్న బాధను చూడలేక చలించిపోయింది. మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతున్న తమ్ముడికి కిడ్నీ దానం చేసి తన సోదర ప్రేమను నిరూపించుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్: రక్షాబంధన్ వేళ ఓ మహిళ తన తమ్ముడికి జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చింది. రెండున్నరేళ్లుగా సోదరుడు పడుతున్న బాధను చూడలేక ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతున్న తమ్ముడికి కిడ్నీ దానం చేసి తన సోదర ప్రేమను నిరూపించుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా.. మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
జితేంద్ర సింగ్ గంగ్వార్ (40) తన అక్క బీనా కుమారి గంగ్వార్ (45)తో కలిసి గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నారు. వివాహం కాకపోవడంతో బీనా కుమారి తన సోదరుడితోనే ఉంటోంది. అయితే, జితేంద్ర కొంతకాలంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అతని రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో జితేంద్రకు కిడ్నీ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే, కిడ్నీ దొరకడం అంత సులభం కాకపోవడంతో బీనా కుమారి ముందుకొచ్చింది. తన సోదరుడి ప్రాణాలు కాపాడాలని బలంగా నిశ్చయించుకుంది. అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతమైంది.

ఆపరేషన్ అనంతరం తన అక్క బీనా కుమారిని తలచుకుని జితేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. డయాలసిస్ సమయంలో తన పిల్లల సంరక్షణ బాధ్యతలను కూడా అక్కే చూసుకుందని చెప్పారు. 'నా అక్క జీవితాంతం అండగా నిలిచింది. ఇప్పుడు తన కిడ్నీ ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె చేసిన సాయానికి మాటలు రావడం లేదు. నా పిల్లలను చూసుకోవడంతో పాటు ఇప్పుడు నాకు మరో జీవితం ఇచ్చింది. ఆమె కోసం నేను ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాను' అని జితేంద్ర తెలిపారు.
మరోవైపు, జితేంద్రకు కిడ్నీ దానం చేయడంపై బీనా కుమారి స్పందించారు. ఈ నిర్ణయం తనకు ఏమాత్రం కష్టంగా అనిపించలేదని చెప్పారు. తన తమ్ముడు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయానని చెప్పుకొచ్చారు. కిడ్నీ ఇవ్వడం త్యాగంగా అనిపించలేదని అన్నారు. అక్కగా తన ప్రేమ, బాధ్యతలో భాగంగానే ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ అక్కాతమ్ముళ్ల ప్రేమపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
150 మందిపై యూపీ ఏటీఎస్ నజర్.. పాక్ టెర్రర్ నెట్‌వర్క్‌తో లింకులపై దర్యాప్తు..
గాలిస్తాం.. అనుమతించండి.. చైనా అధికారులను అభ్యర్థించిన సద్గురు