పశ్చిమాసియా సంక్షోభం.. రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:14 PM
పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం (All party meeting) నిర్వహించనుంది. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షత వహించనున్నారు. హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తారు.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నాలుగో వారానికి చేరుకోవడంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ఆ మార్గం మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తడంతో తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి.
ప్రస్తుత సంక్షోభం ఆందోళనకరంగానే ఉందని, దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం అందుబాటులో ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో వివరించారు. ఇంధన భద్రతకు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో సమష్టిగా పరిస్థితులను ఏవిధంగా ఎదుర్కొన్నామో ఆ విధంగా కలిసికట్టుగా ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శాంతి, చర్చల ద్వారా ఉద్రిక్తతల సడలింపునకు ఐక్య సందేశం ఇవ్వాలని ఉభయసభలను కోరారు. దేశానికి ఇది పరీక్షా సమయమని, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం అవసరమని అన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు పేదలు, వలస కార్మికులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దానిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజనను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. 24 గంటల్లో ఇది రెండోసారి
కాంగ్రెస్ పార్టీకి షాక్.. ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసు