Share News

రాజస్థాన్‌లో పాక్ డ్రోన్ ఆయుధాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్..

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:31 AM

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో పాక్ నుంచి డ్రోన్‌ ద్వారా తరలించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను రాజస్థాన్‌ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీగంగానగర్‌ జిల్లా రావ్లా ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7.75 కిలోల పేలుడు పదార్థాలు, రెండు పిస్టళ్లు, వందల సంఖ్యలో తూటాలు లభించాయి.

రాజస్థాన్‌లో పాక్ డ్రోన్ ఆయుధాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్..
Pakistan Drone Weapons

రాజస్థాన్‌: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో పాక్ నుంచి డ్రోన్‌ ద్వారా తరలించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను రాజస్థాన్‌ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శ్రీగంగానగర్‌ జిల్లా రావ్లా ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7.75 కిలోల పేలుడు పదార్థాలు, రెండు పిస్టళ్లు, వందల సంఖ్యలో తూటాలు లభించాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి పాకిస్థాన్‌కు చెందిన పలువురితో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పండుగల సమయంలో లేదా పంజాబ్‌ ఎన్నికలకు ముందు ఉగ్రదాడికి పాల్పడే ఉద్దేశంతో వీటిని తరలించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Pak2.jpg


అధికారుల వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 12 అర్ధరాత్రి సరిహద్దు అవతలి వైపు నుంచి డ్రోన్‌ ద్వారా అనుమానాస్పద ప్యాకెట్లను జారవిడిచినట్లు భద్రతా సంస్థలకు సమాచారం అందింది. దీంతో రాజస్థాన్‌ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ (ANTF), సరిహద్దు భద్రతా దళం (BSF), స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. తొలుత ఆ ప్యాకెట్లలో మాదకద్రవ్యాలు ఉన్నాయని భావించినప్పటికీ, ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. వాటిల్లో రెండు పిస్టళ్లు, నాలుగు మ్యాగజైన్లు, సుమారు 600 నుంచి 650 తూటాలు, రిమోట్‌ కంట్రోల్‌ పరికరాలు, బ్యాటరీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ఆర్‌డీఎక్స్‌ లేదా ఇతర శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం జైపూర్‌ నుంచి బాంబు నిర్వీర్య బృందాలను రంగంలోకి దింపారు.

Pak.jpg


పట్టుబడిన ఇద్దరు నిందితులు డ్రోన్‌ ద్వారా జారవిడిచిన ఆయుధాలను సేకరించేందుకు వచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సరకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరవేయాల్సి ఉంది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే, ఈ ఘటన వెనుక ఉగ్రదాడి కుట్ర ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా అక్రమంగా మాదకద్రవ్యాలు, ఆయుధాలు తరలించే ప్రయత్నాలు భద్రతా సంస్థలకు సవాలుగా మారుతున్నాయి.

Pak4.jpg


ఈ వార్తలు కూడా చదవండి

కేక్‌లో బూజు.. చాక్లెట్‌లో పురుగు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఆందోళనలు..

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. భారత్ విడిచి వెళ్లాలని ఆదేశం.?

Updated Date - Oct 15 , 2026 | 11:38 AM