నన్ను ఎవరూ ఆపలేరు: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:23 PM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులతో నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతి రద్దు కావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. తనను ఎవరూ అడ్డుకోలేరని, విద్యార్థుల సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులతో రాహుల్ గాంధీ నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతి రద్దు కావడం వివాదంగా మారింది. ఆగస్టు 8న జరగాల్సిన ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమానికి రెండు రోజుల ముందే వేదిక అనుమతిని రద్దు చేశారు. ఈ కార్యక్రమం జరగాల్సిన కేపీ గ్రౌండ్ యజమాని అయిన కాయస్థ పాఠశాల ట్రస్ట్.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను కారణంగా చూపిస్తూ అనుమతిని వెనక్కి తీసుకుంది.
నన్ను ఎవరూ ఆపలేరు: రాహుల్
‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమానికి అనుమతి రద్దు చేయడంపై రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, తనను ఎవరూ ఆపలేరని, విద్యార్థుల సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపు, సీట్ల తగ్గింపుకు వ్యతిరేకంగా విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని రాహుల్ తెలిపారు. వారి సమస్యలను వినకుండా వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
యువత గొంతును అణచివేయడమే ప్రభుత్వ విధానమని, ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, నిరసన చేస్తే కేసులు, మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారని రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి తాను ప్రయాగ్‌రాజ్‌కు రావాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి తన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విద్యార్థుల గొంతుకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విద్యార్థులకు అండగా ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు.
Also Read:
ఎయిర్ గన్‌తో కాల్పులకు తెగబడిన టెకీ.. సెక్యూరిటీ సిబ్బంది, వాహనాలపై పెల్లెట్ల వర్షం..
ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి!