జ్ఞానేశ్ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:40 AM
ఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయడం, లేదంటే ప్రధాని మోదీ ఆయనను తప్పించడం జరిగేదాకా ఉద్యమం ఆగదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.
ఏదో ఒకటి జరిగేదాకా ఉద్యమం ఆగదు
విపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టీకరణ
విపక్ష నేత రాహుల్‌గాంధీ హెచ్చరిక
రామ్‌లీలాలో ర్యాలీని అడ్డుకుంటే మోదీ,షా, జ్ఞానేశ్ ఇళ్ల వద్ద ధర్నా: కాంగ్రెస్
న్యూఢిల్లీ, అక్టోబరు 27: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయడం, లేదంటే ప్రధాని మోదీ ఆయనను తప్పించడం జరిగేదాకా ఉద్యమం ఆగదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. సర్, జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి నవంబరు 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. స్వరాజ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్, సీపీఐ(ఎం.ఎల్) నాయకుడు దీపాంకర్ భట్టాచార్యతో కలిసి ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో జరిగిన ‘జన్ సున్వాయి’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ‘సర్’ బాధితుల వినతులను స్వీకరించారు. త్రిలోక్‌పురిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో 416 మంది ఓట్లను ‘సర్’ పేరిట ఓటరు జాబితానుంచి అక్రమంగా తొలగించారని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. ‘‘అక్రమంగా ఓట్లను తొలగించడంపై మా ప్రశ్నలకు జ్ఞానేశ్‌కుమార్ సమాధానం ఇవ్వడం లేదు. కానీ, మేం ఆయనను వదిలిపెట్టం. సీఈసీ తీరుతో దేశంలో కోట్లాదిమంది తమ ఓటు హక్కు కోల్పోయారు. ఓటు హక్కు సహా సకల హక్కుల్నీ పేదలు కోల్పోతున్నారు. ఎంపిక చేసిన సంపన్నులతో కూడిన కొత్త భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం జరుగుతోంది. అక్కడ పేదలకు ఎలాంటి హక్కులూ ఉండవు. సంపన్నులకే అక్కడ అన్నీ పరిమితం’’ అని రాహుల్ ఆరోపించారు. కాగా, ప్రజా ఉద్యమాన్ని అణచబోయి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమ ప్రతిష్ఠను తానే దిగజార్చుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
సీఈసీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా, ఎందుకు జ్ఞానేశ్‌ను వెనుకేసుకుని వస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఖర్గే ప్రశ్నించారు. మరోవైపు, నవంబరు 1ఆందోళనకు సన్నాహంగా ఈ నెల 30న జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అశోక్ హోటల్‌లో ముందు అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేశారని చెప్పారు. ఇండియా కూటమి ఆందోళన కోసం ఈ నెల 25నుంచి నవంబరు 3 వరకు బుక్ చేసిన రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని ప్రకటించారు. అయితే, రామ్‌లీలా మైదానంలో కూడా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అక్కడ వేదిక నిర్మాణం కోసం వెళ్లిన తమ కార్యకర్తలను అడ్డుకున్నారని వేణుగోపాల్ ఆరోపించారు. ఒకవేళ రామ్‌లీలాలో కార్యక్రమం జరగనీయకపోతే, ధర్నా వేదికను అమిత్‌షా, మోదీ, జ్ఞానేశ్ ఇళ్ల ముందుకు మార్చుతామని హెచ్చరించారు.
ర్యాలీకి షరతులతో అనుమతి: పోలీసులు
రామ్‌లీలా మైదానంలో నవంబరు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయితే, ఈ అనుమతి షరతులకు లోబడి ఉంటుందన్నారు. భూ యాజమాన్య సంస్థ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట మైదానంలో బస చేయకూడదని, అనుమతి ఇచ్చిన ప్రాంతంలో తప్ప మరెక్కడా పాదయాత్ర చేపట్టకూడదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు